ప్రజలు కేవలం ప్రేమకు మాత్రమే లొంగుతారు: ఈటల

17-06-2021 Thu 19:38
  • బీజేపీలో చేరిన ఈటల
  • త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక
  • నియోజకవర్గంపై దృష్టి సారించిన ఈటల
  • ఇకపై ఇంటింటి ప్రచారం చేస్తానని వెల్లడి
Eatala prepares for Huzurabad by election

ఇటీవలే బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నికపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2024 ఎన్నికలకు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక సన్నాహకం వంటిదని అన్నారు. దీంట్లో విజయం తమదేనని ఉద్ఘాటించారు. ఆత్మగౌరవ పోరాటానికి హుజూరాబాద్ వేదిక అయిందని, ఇకపై ఇంటింటి ప్రచారం చేస్తానని వెల్లడించారు.

ప్రజలు కేవలం ప్రేమకు మాత్రమే లొంగుతారని, ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్న రాష్ట్ర మంత్రులకు ఏమైనా ఆత్మగౌరవం ఉందా? అని వ్యాఖ్యానించారు. తన మద్దతుదారులను వేధిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఈటల స్పష్టం చేశారు. కాగా, నేడు హుజూరాబాద్ నియోజకవర్గానికి విచ్చేసిన ఈటలకు ఘనస్వాగతం లభించింది. అభిమానులు భారీగా తరలివచ్చారు.