'నీలాంబరి' తరహా పాత్రను చేయాలనుందట!

17-06-2021 Thu 18:08
  • కన్నడ సినిమాలతో ప్రియమణి బిజీ
  • రీ ఎంట్రీలో పడుతున్న డిఫరెంట్ రోల్స్
  • తెలుగులోనూ బిజీ అవుతుందట!  
Priyamani wants to do Neelambari role

తెలుగు తెరపై మెరిసిన నిన్నటితరం కథానాయికలలో ప్రియమణి ఒకరు. తెలుగులో ప్రియమణి చేసిన సినిమాలలో 'యమదొంగ' పెద్ద హిట్ అని చెప్పాలి. ఇక్కడ ఆమె జగపతిబాబు సరసన ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులో అవకాశాలు తగ్గుతూ ఉండటంతో, ఆమె ఎక్కువగా కన్నడ సినిమాలపై దృష్టిపెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. మధ్యలో మలయాళం సినిమాలను కూడా వదిలిపెట్టలేదు. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులతో ఆమెకి కొంత గ్యాప్ వచ్చింది. అలాంటి ప్రియమణి ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో ఆమె 'విరాటపర్వం' సినిమాలోను .. 'నారప్ప' సినిమాలోను ముఖ్యమైన పాత్రలను పోషించింది. ఈ రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా ప్రభావం పూర్తిస్థాయిలో తగ్గగానే థియేటర్లకు రానున్నాయి.

 ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మాట్లాడుతూ .. "నేను చేసిన ఈ రెండు పాత్రలు చాలా విభిన్నమైనవే. తెలుగులో నా కెరియర్ ఊపందుకునేలా చేసేవే. 'నరసింహ' సినిమాలో రమ్యకృష్ణ చేసిన 'నీలాంబరి' తరహా పాత్రలో చేయాలనుంది. పొగరు .. పంతంతో కూడిన అలాంటి పాత్రలు నా బాడీ లాంగ్వేజ్ కి బాగా సెట్ అవుతాయి. అలాంటి పాత్ర కోసం వెయిట్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. ఆమె ముచ్చట తీరుతుందేమో చూడాలి మరి.