తెలుగు సినిమా షూటింగులపై ఫిలించాంబర్ కీలక నిర్ణయం

17-06-2021 Thu 17:53
  • టాలీవుడ్ పై కరోనా ప్రభావం
  • నిలిచిపోయిన షూటింగులు
  • తగ్గుతున్న కరోనా వ్యాప్తి
  • షూటింగుల పునఃప్రారంభానికి సన్నాహాలు
 Film Chamber takes key decision on film shootings

కరోనా సంక్షోభం ప్రభావం తెలుగు చిత్రపరిశ్రమ పైనా తీవ్రస్థాయిలో పడింది. ఈ నేపథ్యంలో చలనచిత్ర వాణిజ్య మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తుదిదశలో ఉన్న సినిమా షూటింగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి పూర్తిచేయాలని నిర్ణయించింది. తుదిదశలో ఉన్న సినిమా షూటింగులు పూర్తయ్యాకే కొత్త సినిమా షూటింగులకు అంగీకరించాలని ఫిలించాంబర్ స్పష్టం చేసింది. షూటింగ్ లో పాల్గొనే సిబ్బంది కరోనా టీకాలు తీసుకోవాలని పేర్కొంది.

కరోనా సెకండ్ వేవ్ క్రమంగా నిదానిస్తున్న నేపథ్యంలో సినీ రంగంలో మళ్లీ ఊపు కనిపిస్తోంది. ప్రధాన చిత్ర నిర్మాణ సంస్థలు కార్యకలాపాలకు సిద్ధమవుతున్నాయి. నిలిచిపోయిన పెద్ద హీరోల చిత్రాల షూటింగులు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిలించాంబర్ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.