ట్విట్టర్ ను తుడిచిపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది: మమతా బెనర్జీ

17-06-2021 Thu 17:50
  • మా ప్రభుత్వంపై కూడా కేంద్రం అదే ధోరణిని ప్రదర్శిస్తోంది
  • మమ్మల్ని తుడిచిపెట్టడం కేంద్రం వల్ల కాదు
  • బెంగాల్ లో రాజకీయ హింసను ప్రేరేపిస్తున్నారన్న మమత 
Mamata Banerjee Slams Centre In Twitter Issue

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ట్విట్టర్ ను ప్రభావితం చేసేందుకు తొలుత కేంద్రం యత్నించిందని... ఇప్పుడు దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వంపై కూడా కేంద్రం అదే ధోరణిని ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు.

ట్విట్టర్ ను కేంద్రం నియంత్రించాలనుకోవడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మమత అన్నారు. వారి మాట వినని ప్రతి ఒక్కరిపై వారు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే, తనను కానీ, తన ప్రభుత్వాన్ని కానీ తుడిచిపెట్టడం వారి వల్ల కాదని అన్నారు.  

ఐటీ నిబంధనలను పాటించడంలో విఫలమయిందంటూ ట్విట్టర్ పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.