Kangana Ranaut: 'మహా'వినాశకారి ప్రభుత్వం అంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగన ఆగ్రహం

  • 'తేజస్' చిత్రంలో నటిస్తున్న కంగన
  • హంగేరీలో షూటింగ్
  • పాస్ పోర్టు పునరుద్ధరణ కోరిన కంగన
  • దేశద్రోహం కేసు నమోదైందన్న అధికారులు
  • ఆమిర్ ఖాన్ కు ఓ న్యాయమా? అంటూ కంగన ఆక్రోశం
Kanagna fires again on Maharashtra govt

గతేడాది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత నుంచి నటి కంగనా రనౌత్ కు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య యుద్ధం వంటి వాతావరణం నెలకొంది. పలు సందర్భాల్లో కంగన తీవ్ర వ్యాఖ్యలు చేయగా, సర్కారు కూడా తన తడాఖా చూపించింది! తాజాగా కంగన మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తింది.

'మహా'వినాశకారి ప్రభుత్వం అంటూ విమర్శించింది. తనను మళ్లీ పరోక్ష వేధింపులకు గురిచేస్తోందని ఆమె ఆరోపించింది. ఎవరో ఒక వ్యక్తి తనపై పెట్టిన కేసును సాకుగా చూపుతూ పాస్ పోర్టు పొడిగింపుకు అధికారులు సమ్మతించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

కంగన తాజాగా నటిస్తున్న 'తేజస్' చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం హంగేరీ వెళ్లాల్సి ఉంది. పాస్ పోర్టు రెన్యువల్ కోసం కంగన ముంబయి పాస్ పోర్టు కేంద్రానికి వెళ్లగా, ఆమెపై బాంద్రా పోలీస్ స్టేషన్ లో దేశద్రోహం కేసు నమోదైన విషయాన్ని అధికారులు తెలిపారు. పోలీస్ కేసు నేపథ్యంలో పాస్ పోర్టును పొడిగించలేమని స్పష్టం చేశారు.

దాంతో కంగన హైకోర్టును ఆశ్రయించగా, ఆమె దరఖాస్తులో స్పష్టత లోపించిందని న్యాయస్థానం కేసు విచారణను వాయిదా వేసింది. దీనిపై మరింత ఆక్రోశం వ్యక్తం చేసిన కంగన... గతంలో ఇదే రీతిలో ఆమిర్ ఖాన్ కేంద్ర ప్రభుత్వాన్ని దూషిస్తే అతని పాస్ పోర్టుని నిలిపివేయలేదని, అతని సినిమా కార్యకలాపాలకు ఇబ్బందులు కలుగజేయలేదని కంగన తెలిపింది. కానీ తన విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె మండిపడింది. 

More Telugu News