Nuclear Warheads: అణు వార్ హెడ్ల విషయంలో భారత్ కంటే ముందున్న చైనా, పాకిస్థాన్

  • ఎస్ఐపీఆర్ఐ తాజా గణాంకాలు విడుదల
  • చైనా వద్ద 350 న్యూక్లియర్ వార్ హెడ్లు
  • పాకిస్థాన్ వద్ద 165 అణ్వస్త్రాలు
  • భారత్ వద్ద 156 మాత్రమే ఉన్నట్టు వెల్లడి
  • ఎవరికీ అందనంత ఎత్తులో రష్యా, అమెరికా
China and Pakistan are ahead of India in nuclear warheads

ఇటీవల రాఫెల్, అగ్ని-5, అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ వంటి తిరుగులేని అస్త్రాల చేరికతో భారత రక్షణ రంగ పాటవం మరింత ఇనుమడించింది. ఈ అత్యాధునిక ఆయుధాల రాకతో భారత సరిహద్దుల వైపు చూడాలంటే పొరుగుదేశాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ అణు వార్ హెడ్ల విషయంలో మాత్రం భారత్ ఇప్పటికీ చైనా, పాకిస్థాన్ దేశాల కంటే వెనుకబడే ఉంది.

చైనా వద్ద ఉన్న అణు వార్ హెడ్ల సంఖ్య 350 కాగా, తీవ్ర దుర్భిక్షంతో అల్లాడిపోయే పాకిస్థాన్ వద్ద 165 అణు వార్ హెడ్లు ఉన్నాయి. భారత్ వద్ద మాత్రం 156 మాత్రమే ఉన్నాయి. ప్రపంచదేశాల అణ్వస్త్ర కార్యక్రమాలపై ఓ కన్నేసి ఉంచే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) ఈ మేరకు తాజా గణాంకాలు వెల్లడించింది.

ఇక, ప్రపంచవ్యాప్త గణాంకాలు చూస్తే... కేవలం 9 దేశాల వద్దే 13,080 అణు వార్ హెడ్లు ఉన్నాయట. వాటిలో అత్యధికంగా ఒక్క రష్యా వద్దే 6,255 అణు వార్ హెడ్లు పోగుపడినట్టు గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో అమెరికా (5,550) ఉంది. మిగతా దేశాలతో పోల్చితే ఈ రెండు దేశాల వద్దే వేల సంఖ్యలో అణ్వాయుధాలు ఉండడం గమనార్హం. ఫ్రాన్స్ వద్ద 290, బ్రిటన్ వద్ద 225, ఇజ్రాయెల్ వద్ద 90, ఉత్తర కొరియా వద్ద 40 నుంచి 50 వరకు అణ్వస్త్రాలు ఉన్నట్టు ఎస్ఐపీఆర్ఐ పేర్కొంది.

More Telugu News