మాన్సాస్ చైర్మన్ గా ఉన్నప్పుడు అశోక్ గజపతిరాజు ఏం అభివృద్ధి చేశారు?: మంత్రి వెల్లంపల్లి

15-06-2021 Tue 15:27
  • మాన్సాస్ ట్రస్టు అంశంలో హైకోర్టు కీలక తీర్పు
  • చైర్మన్ గా అశోక్ గజపతిని నియమించాలని ఆదేశం
  • స్పందించిన మంత్రి వెల్లంపల్లి
  • అప్పీల్ కు వెళుతున్నట్టు స్పష్టీకరణ
Vellampalli asks what has done by Ashok Gajapathi towards Mansas Trust

మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా అశోక్ గజపతిరాజును పునర్నియమించాలని నిన్న ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం తెలిసిందే. దీనిపై మళ్లీ అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా పనిచేసిన కాలంలో అశోక్ గజపతి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. పదవులు ముఖ్యం కాదని, అభివృద్ధి కూడా చూడాలని వ్యాఖ్యానించారు. మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయిత నియామకాన్ని అశోక్ గజపతి రాజు జీర్ణించుకోలేకపోయారని విమర్శించారు.

మాన్సాస్ ట్రస్టు విషయంలో ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళుతున్నామని నిర్ధారించారు. అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను గుర్తిస్తున్నామని, ప్రభుత్వ చర్యలతో భూఆక్రమణ దారులపై అందరికీ భయం పట్టుకుందని అన్నారు. మాన్సాస్ ట్రస్టు పరిధిలో అన్యాక్రాంతమైన భూములపైనా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. దేవాదాయ భూములను చంద్రబాబు నాడు పప్పుబెల్లాల్లా పంచారని ఆరోపించారు. దేవాదాయ భూములను సంరక్షించడమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లంపల్లి ఉద్ఘాటించారు.