Supreme Court: మృతుల కుటుంబాలకు భారీ పరిహారం.. ఇటలీ నావికా సిబ్బందిపై కేసులను మూసివేసిన సుప్రీంకోర్టు!

Supreme Court closes Italian marines case
  • 2012లో ఇద్దరు కేరళ మత్స్యకారుల కాల్చివేత
  • ఇటలీ నౌకా సిబ్బందిపై ఆరోపణలు
  • సుప్రీంలో విచారణ
  • రూ.10 కోట్ల పరిహారం చెల్లించిన ఇటలీ ప్రభుత్వం
కేరళ సముద్రతీరంలో 2012లో ఇద్దరు మత్స్యకారులను కాల్చివేసినట్టు ఇటలీకి చెందిన ఓ నౌకా సిబ్బందిపై ఆరోపణలు రావడం తెలిసిందే. మాస్సిమిలియానో లాట్టోరే, సాల్వటోర్ గిరోన్ అనే ఇద్దరు నావికులు... మత్స్యకారులపై కాల్పులు జరిపి వారి మరణానికి కారకులయ్యారని కేసు నమోదు కాగా, వారిద్దరూ కొంతకాలం భారత్ లో జైల్లో కూడా ఉన్నారు. అనేక పరిణామాల నేపథ్యంలో ఆ ఇటలీ నావికులు విడుదలై స్వదేశానికి వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో, ఇటలీ ప్రభుత్వం కేరళ మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 కోట్లు పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటలీ నావికులపై విచారణ ఇంతటితో ముగిస్తున్నట్టు నేడు వెల్లడించింది. ఇటలీ చెల్లిస్తానంటున్న పరిహారం సంతృప్తికరంగా ఉందని, ఈ కేసు మూసివేతకు రాజ్యాంగం ప్రకారం ఇదే సరైన సమయం అని భావిస్తున్నామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అయితే, భారత్, ఇటలీ, కేరళ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలు, అంతర్జాతీయ మధ్యవర్తిత్వ నిబంధనలు అనుసరించి ఇకపై ఆ ఇద్దరు నావికులపై ఇటలీలో విచారణ జరపాలని స్పష్టం చేసింది.

కాగా, ఇటలీ ప్రభుత్వం ఇచ్చిన రూ.10 కోట్ల పరిహారంలో చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.4 కోట్ల చొప్పున ఇవ్వనున్నారు. వారి బోటు యజమానికి మిగిలిన రూ.2 కోట్లు ఇవ్వనున్నారు.
Supreme Court
Italy
Marines
Kerala Fishermen
India

More Telugu News