చైనా తీరు మార్చుకోవాల్సిందే: గ‌ట్టిగా హెచ్చ‌రించిన నాటో దేశాలు

15-06-2021 Tue 13:04
  • బ్రసెల్స్‌లో నాటో స‌మావేశం
  • జో బైడెన్ స‌హా 30 దేశాల అధినేత‌లు హాజ‌రు
  • సైనికపరంగా చైనాతో ప్రపంచ భద్రతకే ప్రమాదమ‌ని ఆందోళ‌న‌
  • డ్రాగ‌న్ దేశం బాధ్యతగా వ్యవహరించాలని సూచ‌న‌
nato warns china

బ్రసెల్స్‌లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)  ప్రధాన కార్యాలయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ స‌హా కూట‌మిలోని 30 దేశాల అధినేత‌లు సమావేశమ‌య్యారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా చైనా నుంచి పొంచి ఉన్న‌ ముప్పుపైనే చ‌ర్చించ‌డం గ‌మ‌నార్హం.

సైనికపరంగా చైనాతో ప్రపంచ భద్రతకే ప్రమాదం పొంచి ఉందని ఆ కూట‌మి చెప్పింది. అణు క్షిపణుల విష‌యంలోనూ డ్రాగ‌న్ దేశం బాధ్యతగా వ్యవహరించాలని నాటో త‌మ తీర్మానంలో పేర్కొంది. అంతర్జాతీయ నియమాలను చైనా గౌరవించాల్సిందేన‌ని తెలిపింది. చైనాతో పాటు రష్యా తీరుపై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కూడా అభ్యంత‌రాలు తెలిపారు. ఐరోపాకు తాము అండగా ఉంటామని చెప్పారు.

నాటో ఒప్పందంలోని 5వ అధికరణం ప్రకారం కూటమిలోని ఒక దేశంపై ఏ దేశం నుంచైనా దాడి జరిగితే అది అన్ని దేశాలపై జరిగినట్టు భావించవలసి ఉంటుందని హెచ్చ‌రించారు. అలాగే, నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్ కూడా చైనాతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు నాటో సిద్ధంగా ఉండాలన్నారు.

చైనా చాలా కీలకమైన రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. అలాగే, ప్రచ్ఛన్నయుద్ధం అనంత‌రం రష్యాతో సంబంధాలు ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారని స్టోల్టెన్‌బర్గ్ పేర్కొన్నారు. నాటో కూటమి దేశాల‌ నేతలు చైనా అనుసరిస్తున్న నిర్బంధ విధానాలపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

ఇతరులను తన దారిలోకి తెచ్చుకునేందుకు చైనా ప్ర‌వ‌ర్తిస్తోన్న తీరు వల్ల అంతర్జాతీయ భద్రతకు వ్యవస్థాగత సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. అంతరిక్షం, సైబర్, సముద్రాలు సహా అంతర్జాతీయ వ్యవస్థ పట్ల బాధ్యతాయుతంగా ప్ర‌వ‌ర్తించాల‌న్నారు.