సీఎం జగన్ అభినందనలు పొందేలా ప్రజాసేవ చేయాలి: నూతన సర్పంచ్ లకు మంత్రి పెద్దిరెడ్డి దిశానిర్దేశం

14-06-2021 Mon 15:00
  • ఏపీలో గ్రామ పంచాయతీలకు కొత్త సర్పంచ్ లు
  • జగనన్న స్వచ్ఛ సంకల్పంపై అవగాహన
  • వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి
  • శ్రమించే సర్పంచ్ లకు గుర్తింపు ఉంటుందని వెల్లడి
Minister Peddireddy video conference on Jagananna Swacha Sankalpam

ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తయి, నూతన పాలక వర్గాలు బాధ్యత స్వీకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కొత్తగా కొలువుదీరిన సర్పంచ్ లకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు.

గ్రామ సచివాలయ వ్యవస్థలను సక్రమరీతిలో వినియోగించుకుని, సమర్థవంతమైన గ్రామ పరిపాలన అందించాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ ప్రవేశపెట్టారని, గ్రామీణ పరిపాలనలో సంచలన మార్పులు తీసుకువచ్చారని వివరించారు. కొత్త సర్పంచ్ లు సీఎం జగన్ అభినందనలు పొందేలా మెరుగైన ప్రజాసేవ చేయాలని ఉద్బోధించారు. ఉత్తమ పాలన అందించే సర్పంచ్ లకు తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

పాలనలో సత్వర నిర్ణయాలకు వీలుగా ఇప్పటికే 11,152 మంది సర్పంచ్ లకు చెక్ పవర్ ఇచ్చామని, మరో 1,943 మందికి త్వరలోనే చెక్ పవర్ ఇస్తామని వెల్లడించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై సర్పంచ్ లకు అవగాహన కల్పించే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.