Vellampalli Srinivasa Rao: మాన్సాస్ ట్రస్టు విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నాం: ఏపీ మంత్రి వెల్లంపల్లి

Minister Vellampalli Srinivas responds on Mansas Trust issue
  • మాన్సాస్ ట్రస్టుపై కోర్టులో సర్కారుకు ఎదురుదెబ్బ
  • జీవోలు కొట్టివేసిన కోర్టు
  • తాము చట్టప్రకారమే ముందుకెళతామన్న వెల్లంపల్లి 
  • కోర్టు ఆదేశాలను బట్టి అప్పీల్ చేస్తామని వెల్లడి
మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ట్రస్టు పాలకవర్గంపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీఎం జగన్ ను కలిసి తాజా పరిణామాలను నివేదించారు. అనంతరం మాట్లాడుతూ, మాన్సాస్ ట్రస్టు విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కోర్టు ఆదేశాలను బట్టి మళ్లీ అప్పీల్ కు వెళతామని చెప్పారు. తాము ఏం చేసినా చట్టప్రకారం, న్యాయబద్ధంగానే ముందుకు వెళతామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. మాన్సాస్ ట్రస్టు అంశంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

అటు, బ్రహ్మంగారి మఠం అంశంలోనూ ఇదే పంథా అనుసరిస్తామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. బ్రహ్మంగారి మఠం వివాదాన్ని సీఎంకు వివరించామని, ఆయన నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారని వెల్లడించారు. మఠానికి సంబంధించిన వీలునామా చట్టప్రకారం 90 రోజుల్లో ధార్మిక పరిషత్ కు చేరాలని అన్నారు. దీనిపై పీఠాధిపతులతో కమిటీ వేసి చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బ్రహ్మంగారి మఠం విషయంలో శివస్వామి ముందుగానే నిర్ణయాన్ని ప్రకటించడం సరికాదని మంత్రి వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు.
Vellampalli Srinivasa Rao
Mansas Trust
AP High Court
Brahmam Gari Matam
YSRCP
Andhra Pradesh

More Telugu News