ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ఆదేశాలు వచ్చాయంటూ పలువురికి నోటీసులు పంపిన ట్విట్టర్

12-06-2021 Sat 21:55
  • నూతన ఐటీ మార్గదర్శకాలు తీసుకువచ్చిన కేంద్రం
  • సమ్మతి తెలిపిన ట్విట్టర్
  • తాజాగా ముగ్గురికి నోటీసులు
  • యూజర్లు కోర్టుకు వెళ్లొచ్చన్న ట్విట్టర్
Twitter issues notices to users

ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన నూతన ఐటీ మార్గదర్శకాలను పాటిస్తామని ట్విట్టర్ సమ్మతి తెలిపిన కొన్నిరోజులకే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏజెన్సీలు ఆదేశించాయంటూ ట్విట్టర్ పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. చట్ట వ్యతిరేకంగా ఉన్న ట్వీట్లను తొలగించాలని కేంద్ర ఏజెన్సీలు కోరాయని ట్విట్టర్ పేర్కొంది.

ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు, కొందరు యూజర్లకు నోటీసులు పంపామని వెల్లడించింది. యూజర్లు దీనిపై కోర్టును ఆశ్రయించవచ్చని, లేదంటే స్వచ్ఛందంగా ఆయా ట్వీట్లను తొలగించవచ్చని వివరించింది. కాగా, ట్విట్టర్ నుంచి నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖ కార్టూనిస్టు మంజుల్, ఆల్ట్ సైట్ (ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్) సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి సూర్యప్రతాప్ సింగ్ ఉన్నారు.