నిరుపేద బాలల పట్ల ముంబయి లేడీ కానిస్టేబుల్ మంచి మనసు
- ముంబయిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రెహానా
- 50 మంది బాలలను దత్తత తీసుకున్న వైనం
- 10వ తరగతి వరకు చదివించాలని నిర్ణయం
- రెహానా నిర్ణయానికి కుటుంబ సహకారం
ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 50 మంది పిల్లలను ఆమె దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తున్నారు. వారంతా ఒకే స్కూలుకు చెందిన బాలలు. విధి నిర్వహణలో ఏమాత్రం విరామం దొరికినా, ఆ చిన్నారుల కోసమే సమయ్యాన్ని వెచ్చిస్తారు.
రెహానాకు ఈ విషయంలో కుటుంబ సభ్యులు అండ పుష్కలంగా ఉంది. ఆమె భర్త కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ లోనే పనిచేస్తున్నారు. రెహానా కుటుంబంలో ఆరుగురు సభ్యులు ఉండగా, అటు వారందరికీ ఏర్పాట్లు చేసి, ఇటు 50 మంది పిల్లల విద్యా బాధ్యతలు చూసుకుంటూ ఓ మహిళ ఏంచేయగలదో నిరూపిస్తున్నారు.
కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఓ ఫ్రెండ్ చూపించిన కొన్ని ఫొటోలు ఆమెలోని సేవా దృక్పథాన్ని మేల్కొలిపాయి. ఆ ఫొటోలు ఓ పాఠశాల చిన్నారులకు సంబంధించినవి. దుర్భర దారిద్ర్యంతో ఉన్న ఆ చిన్నారులకు 10వ తరగతి వరకు విద్యా ఖర్చులను భరించాలని ఆ క్షణానే నిర్ణయించుకున్నారు. రెహానా మంచి మనసుతో చేస్తున్న ఈ పని పట్ల పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందిస్తున్నారు.