Eatala Rajender: ఈటల రాజీనామాను ఆమోదించిన అసెంబ్లీ స్పీకర్

Telangana assembly speaker Pocharam Srinivasa Reddy approves Eatala resignation as MLA
  • ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల
  • స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం అసెంబ్లీకి కార్యదర్శికి అందజేత
  • ఆమోద ముద్ర వేసిన పోచారం
  • ఈ నెల 14న బీజేపీలో చేరనున్న ఈటల
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ తో అన్ని సంబంధాలు తెగిపోయాయి. ఆయన ఇక బీజేపీలో చేరడమే తరువాయి. ఈటల నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈటల రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. నేడు అమరవీరులకు నివాళులు అర్పించిన ఈటల స్పీకర్ ఫార్మాట్ లో రూపొందించిన తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. ఆ రాజీనామా పత్రాన్ని పరిశీలించిన స్పీకర్ పోచారం ఆమోద ముద్ర వేశారు.

భూఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొన్న ఈటలను తెలంగాణ మంత్రివర్గం నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన ఈటల బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 14న ఆయన బీజేపీలో చేరనున్నారు. ఈ సాయంత్రం ఈటల ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన వెంట రమేశ్ రాథోడ్, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి నేతలు కూడా హస్తిన వెళ్లి బీజేపీలో చేరతారని తెలుస్తోంది.

అంతకుముందు, రాజీనామా సందర్భంగా ఈటల మాట్లాడుతూ, హుజూరాబాద్ లో కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరగబోతోందని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి మధ్య పోరాటం వంటిదని పేర్కొన్నారు. త్వరలో హుజూరాబాద్ లో పాదయాత్ర చేస్తానని వెల్లడించారు.
Eatala Rajender
MLA
Resignation
Pocharam Srinivas
Assembly Speaker
Telangana
TRS
BJP

More Telugu News