Etela Rajender: రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్‌కు అందిద్దామ‌నుకున్నా.. కానీ, అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి ఇవ్వాల్సి వ‌చ్చింది: ఈట‌ల‌

  • అసెంబ్లీలో స‌భాప‌తి కార్యాల‌యంలో లేఖ‌ను ఇచ్చిన ఈట‌ల‌
  • అనివార్య కార‌ణాల వ‌ల్ల ఇలా చేశాన‌ని వివ‌ర‌ణ‌
  • నా అనుచ‌రుల‌ను లోప‌లికి రానివ్వ‌లేదని ఆగ్ర‌హం
etela  resigns as mla

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను అసెంబ్లీలో స‌భాప‌తి కార్యాల‌యంలో అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుతూ.. స‌భాప‌తిని క‌లిసి రాజీనామా లేఖ ఇవ్వాల‌ని భావించాన‌ని తెలిపారు. అయితే, అనివార్య ప‌రిస్థితుల్లో రాజీనామా లేఖ‌ను అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి అంద‌జేశాన‌ని చెప్పారు. త‌న‌తో వ‌చ్చిన త‌న అనుచ‌రుల‌ను, మ‌ద్ద‌తుదారుల‌ను అసెంబ్లీ సిబ్బంది లోప‌లికి అనుమ‌తించ‌లేద‌ని ఆయ‌న తెలిపారు.

'తెలంగాణ‌లో నియంతృత్వ పాల‌న కొన‌సాగుతోంది.  మీడియా పాయింట్ వ‌ద్ద‌కు ఈ రోజు ర‌వీంద‌ర్ రెడ్డిని కూడా అనుమ‌తించ‌లేదు. దీన్ని బ‌ట్టి ఫ్యూడ‌ల్ వ్య‌వ‌స్థ ఎంత బ‌లంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. త‌న‌కు ప్ర‌జ‌లు క‌నెక్ట్ అయ్యార‌ని, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు? ఎంపీలు ఎందుకు? అని కేసీఆర్ గారు అంటుంటారు. ఆ విధంగా వ్య‌వ‌స్థ‌ల‌ను ఆయ‌న అవ‌మానిస్తున్నారు' అని ఈట‌ల రాజేంద‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

స్పీక‌ర్ రాజీనామాను ఆమోదించాక హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గానికి ఆరు నెల‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు ఇటీవ‌లే రాజీనామా చేశారు. ఈనెల 14న ఆయ‌న బీజేపీలో చేర‌డానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు నేత‌లు కూడా బీజేపీలో చేర‌నున్నారు.

More Telugu News