కరోనా బాధితుడి నుంచి అదనంగా రూ. 10.84 లక్షల ఫీజు.. కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి రూ. 75.88 లక్షల జరిమానా

12-06-2021 Sat 09:34
  • కాకినాడలోని సాయిసుధ ఆసుపత్రిలో ఘటన
  • రూ. 3.16 లక్షలకు అదనంగా రూ. 10.84 లక్షల ఫీజు వసూలు
  • రూ. 75.88 లక్షల జరిమానాతోపాటు అదనంగా వసూలు చేసిన రూ. 10.84 లక్షలకు చెక్కులు ఇచ్చిన ఆసుపత్రి
AP Govt fined Over Rs 75 lakhs to kakinada sai sudha hospital
కరోనాతో ఆసుపత్రిలో చేరిన బాధితుడి నుంచి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే అదనంగా రూ. 10.84 లక్షలు వసూలు చేసిన ప్రైవేటు ఆసుపత్రికి ఏపీ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఒబిలిశెట్టి సత్యనారాయణ కరోనాతో బాధపడుతూ గత నెల 14న నగరంలోని సాయిసుధ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆసుపత్రి యాజమాన్యం చికిత్స ఫీజు కింద రూ. 14 లక్షలు వసూలు చేసింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

కలెక్టరేట్‌లో నిన్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్, సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి అధ్యక్షతన జరిగిన విచారణకు ఆసుపత్రి ప్రతినిధులు హాజరయ్యారు. బాధిత కుటుంబం నుంచి చికిత్స నిమిత్తం రూ. 3.16 లక్షలు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా రూ. 10.84 లక్షలు అదనంగా వసూలు చేసినట్టు విచారణలో తేలింది. దీంతో అదనంగా వసూలు చేసిన సొమ్మునకు ఏడు రెట్లు (రూ. 75.88 లక్షలు) జరిమానా విధించారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డికి అందజేసింది. దీంతోపాటు బాధిత కుటుంబం నుంచి అదనంగా వసూలు చేసిన రూ. 10.84 లక్షలకు మరో చెక్కును కూడా అందజేసింది.