సంబరాలు చేసుకునే సమయం ఇంకా రాలేదు: నీతి ఆయోగ్‌ సభ్యుడు డా.వి.కె.పాల్‌

11-06-2021 Fri 19:00
  • కొనసాగుతున్న అన్‌లాక్‌ ప్రక్రియ
  • అప్రమత్తంగా ఉండాలని పాల్‌ సూచన
  • కరోనా కట్టడి నిబంధనల్ని పాటించాలని హితవు
  • లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిక
  • వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడి
Time has not come to clebrate yet says vk paul

సంబరాలు చేసుకునే పరిస్థితులు దేశంలో ఇంకా నెలకొనలేదని నీతి ఆయోగ్‌(ఆరోగ్యం) సభ్యుడు, కేంద్ర కరోనా నియంత్రణ టాస్క్‌ఫోర్స్‌లో కీలక సభ్యుడు డా.వి.కె.పాల్‌ అన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఆంక్షల సడలింపు, అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని తెలిపారు.

కరోనా కట్టడి నిబంధనల్ని పాటించని పక్షంలో ఇబ్బందులు తప్పవని పాల్‌ హెచ్చరించారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో సీరో సర్వేలు నిర్వహించాల్సి ఉందన్నారు. అందుకనుగుణంగా ఆయా స్థాయుల్లోనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. హాట్‌స్పాట్‌లు మినహా మిగిలిన ప్రాంతాల్లో అన్‌లాక్‌ ప్రక్రియను క్రమంగా అమలు చేయొచ్చని తెలిపారు. అలాగే క్లినికల్‌, ఎపిడెమాలజీ డేటా సేకరించి మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయో అంచనా వేయాల్సి ఉందన్నారు.

వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయని పాల్‌ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెరుగుతోందన్నారు. తొలి డోసు తీసుకున్నవారు రెండో డోసు తీసుకోవాలని సూచించారు. హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, పెద్దలు ఇంకా టీకా రెండో డోసు తీసుకోలేదన్నారు. వీలైనంత త్వరగా వీరంతా టీకా వేయించుకోవాలన్నారు.