Hardeep Kaur: కుటుంబ పోషణ కోసం వ్యవసాయ కూలీగా మారిన జాతీయ క్రీడాకారిణి

  • కరాటేలో భారత్ కు ప్రాతినిధ్యం
  • అంతర్జాతీయ వేదికపై స్వర్ణం సాధించిన హర్దీప్ కౌర్
  • ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్న పంజాబ్ సర్కారు
  • బుట్టదాఖలైన హామీ
  • వరి పొలాల్లో కూలి పనులు చేస్తున్న కౌర్
National Karate champ turns daily wager

క్రీడా సంఘాలు, ప్రభుత్వ సాయం లేకపోతే ఎంతోమంది క్రీడాకారులు తెరమరుగై పోతుంటారు. ఆర్థిక పరిస్థితి సహకరించక క్రీడలను వదిలేసి ఇతరత్రా జీవనోపాధి వెతుక్కోవడం సాధారణ విషయంగా మారింది. 23 ఏళ్ల హర్దీప్ కౌర్ వ్యవహారం కూడా ఇలాంటిదే. కరాటే పోటీల్లో అంతర్జాతీయంగా సత్తా చాటిన ఈ పంజాబ్ యువతి ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వ్యవసాయ కూలీగా మారింది.

మూడేళ్ల కిందట మలేసియాలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నీలో హర్దీప్ కౌర్ పసిడి పతకం సాధించింది. ఓవరాల్ గా ఇరవైకి పైగా మెడల్స్ ఆమె ఖాతాలో చేరాయి. అప్పట్లో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని పంజాబ్ సర్కారు హామీ ఇచ్చినా, అది నెరవేరలేదు. అయితే పేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టంలేక తను కూడా వారితోపాటే కూలి పనులకు వెళుతోంది. ఓవైపు వ్యాయామ విద్యలో డిప్లొమా చేస్తూనే, తమ గ్రామంలో వరి పొలాల్లో కూలీగా పనిచేస్తూ కన్నవారికి చేదోడువాదోడుగా ఉంటోంది.

మలేసియా వంటి దేశాల్లో భారత ఖ్యాతిని చాటిన తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని చెబుతూ హర్దీప్ కౌర్ కన్నీటి పర్యంతమైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆమె కోరుకుంటోంది.

More Telugu News