అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ

11-06-2021 Fri 16:19
  • పుట్టినరోజు సందర్భంగా బాలయ్యకు శుభాకాంక్షల వెల్లువ 
  • కరోనా నేపథ్యంలో వేడుకలు వద్దని ముందే కోరిన బాలయ్య
  • అందరికీ సిరిసంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించిన బాలయ్య
Balakrishna thanks his fans

అభిమానులను ప్రేమించడంలో సినీ నటుడు బాలకృష్ణకు మరెవరూ సాటిరారని ఆయన ఫ్యాన్స్ చాలా గర్వంగా చెప్పుకుంటుంటారు. బాలయ్య కూడా తాను మాట్లాడిన ప్రతిసారి అభిమానులే తనకు దేవుళ్లు అని చెపుతూ ఉంటారు. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ సారి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఎవరూ వేడుకలను నిర్వహించవద్దని ఆయన కోరారు. అయితే, ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

తాజాగా ఆయన స్పందిస్తూ, తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆత్మీయులు, సినీ కళాకారులు, సహచరులు, కార్యకర్తలు, హిందూపురం నియోజకవర్గ ప్రజలు, ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రపంచ నలుదిక్కుల ఉన్న తన అభిమానులకు ధన్యవాదాలను తెలియజేస్తున్నానని చెప్పారు. తన మంచిని కోరే మీరందరూ ఎల్లప్పుడూ ఉన్నత స్థానంలో ఉండాలని, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు మీకు కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.

మరోవైపు తన పుట్టినరోజు వేడుకలను బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయన జరుపుకున్నారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ పేషెంట్లకు సేవ చేస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు.