ఆమె సచిన్ టెండూల్కర్ తో మాట్లాడారేమో.. నాతో మాట్లాడే ధైర్యం లేదు: సచిన్ పైలట్

11-06-2021 Fri 15:58
  • సచిన్ పైలట్ బీజేపీలో చేరబోతున్నారన్న రీటా
  • తనతో మాట్లాడారని వ్యాఖ్య
  • అసలు ఆమెతో మాట్లాడనేలేదన్న సచిన్ పైలట్
Rita Bahuguna has no guts to speak with me says Sachin Pilot

ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకురాలు రీటా బహుగుణ జోషిపై రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మండిపడ్డారు. తాను బీజేపీలో చేరడానికి అంగీకరించానని ఆమె చెపుతున్న మాటల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన అన్నారు. అసలు ఆమెతో తాను మాట్లాడనే లేదని చెప్పారు. సచిన్ తో మాట్లాడానని రీటా బహుగుణ చెపుతున్నారని... బహుశా ఆమె క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో మాట్లాడారేమోనని... తనతో మాట్లాడే ధైర్యం ఆమెకు లేదని ఎద్దేవా చేశారు.

సచిన్ పైలట్ బీజేపీలో చేరబోతున్నారంటూ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో రీటా బహుగుణ నిన్న ఓ హిందీ మీడియాతో మాట్లాడుతూ, సచిన్ ను కాంగ్రెస్ చులకనగా చూస్తోందని... త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సచిన్ పైలట్ తీవ్రంగా ప్రతిస్పందించారు.