కేంద్రం జీవాయుధాన్ని ప్రయోగించిందన్న సినీ దర్శకురాలు​.. దేశద్రోహం కేసు పెట్టిన లక్షద్వీప్ పోలీసులు

11-06-2021 Fri 13:53
  • భయపడబోనన్న లక్షద్వీప్ డైరెక్టర్ అయీషా సుల్తానా
  • మరింతగా గళమెత్తుతానని వెల్లడి
  • ఆమెకు మద్దతుగా నిలిచిన శశిథరూర్
Lakshadweep Film Maker Calls Center Used Bio weapon police responds with sedition case

లక్షద్వీప్ పాలకుడు ప్రఫుల్ ఖోడాను సినీ దర్శకురాలు అయీషా సుల్తానా జీవాయుధంతో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడంతో అక్కడి పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు. విద్వేష ప్రసంగం కింద కేసులు నమోదు చేశారు. కరోనా కట్టడిలో లక్షద్వీప్ పాలకుడు ప్రఫుల్ ఖోడా విఫలమయ్యారని, కేసులు పెరగడానికి ఆయనే కారణమని ఓ స్థానిక మలయాళం టీవీ చానెల్ లో జరిగిన చర్చా గోష్ఠిలో పాల్గొన్న అయీషా వ్యాఖ్యానించింది. అంతేగాకుండా మరో అడుగు ముందుకేసి ఆయన నియామకంతో కేంద్ర ప్రభుత్వమే లక్షద్వీప్ పై ఓ జీవాయుధాన్ని ప్రయోగించిందని కామెంట్ చేసింది.

ఒకప్పుడు లక్షద్వీప్ లో సున్నా కేసులుండేవని, కానీ, ఇప్పుడు రోజూ 100కు పైగానే వస్తున్నాయని ఆమె పేర్కొంది. కాబట్టి లక్షద్వీప్ పై కేంద్ర ప్రభుత్వమే జీవాయుధాన్ని ప్రయోగించిందని అంటానని వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యలతో లక్షద్వీప్ బీజేపీ నేతలు వీధుల్లో ఆందోళనలు నిర్వహించారు. ఆమెపై బీజేపీ లక్షద్వీప్ చీఫ్ సి. అబ్దుల్ ఖాదర్ హాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమన్నారు.

ఇక తనపై పెట్టిన కేసుపై అయీషా స్పందించారు. ఎప్పుడూ నిజమే గెలుస్తుందని ఫేస్ బుక్ పోస్ట్ లో కామెంట్ చేశారు. ఓ బీజేపీ కార్యకర్త కేసు వేసినంత మాత్రాన భయపడిపోనన్నారు. తాను పుట్టినగడ్డ మీద తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక, తన గళాన్ని మరింత గట్టిగా వినిపిస్తానని పేర్కొన్నారు.

పలువురు రాజకీయ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. కేసును వెంటనే వెనక్కు తీసుకోవాలని శశిథరూర్ డిమాండ్ చేశారు. ఈ కేసు నిలవదన్నారు. కేంద్రాన్ని విమర్శించినంత మాత్రాన దేశద్రోహం కాదని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పిందని, అయినా రాష్ట్రాల పోలీసులు దానిని పట్టించుకోవట్లేదన్నారు. కోర్టులో దేశద్రోహం కేసు విఫలమవుతుందని, అయితే, అప్పటి వరకు ఆమెకు చిత్ర హింసలు తప్పవని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిదికాదని అన్నారు.