ఇక చాలు.. దయచేయండి.. యడియూరప్పకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు?

11-06-2021 Fri 08:51
  • ధ్రువీకరించిన బీజేపీ వర్గాలు
  • కానే కాదంటున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అరుణ్ సింగ్
  • వచ్చేవారం బెంగళూరుకు అరుణ్ సింగ్
Yediyurappa Wont Step Down says BJPs Karnataka incharge

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను పదవీగండం వెంటాడుతోంది. యడియూరప్పను మార్చాల్సిందేనంటూ పట్టుబడుతున్న నేతల ఒత్తిడికి అధిష్ఠానం తలొగ్గినట్టు తెలుస్తోంది. వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని యడ్డీని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అత్యున్నత వర్గాలు ధ్రువీకరించాయి.

మరోవైపు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అరుణ్‌సింగ్ మాత్రం నాయకత్వ మార్పులపై వస్తున్న వార్తలను కొట్టిపడేశారు. అయితే, ఈ నెల 17, 18 తేదీల్లో ఆయన బెంగళూరుకు రానుండడం నాయకత్వ మార్పునకు సంకేతమని వార్తలొస్తున్నాయి.

నిన్న ఢిల్లీలో మాట్లాడిన అరుణ్‌సింగ్.. యడ్డీపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఉత్తమంగా పాలిస్తున్నారని ప్రశంసించారు. సీఎం పనితీరుపై బీజేపీ అధినాయకత్వం సంతృప్తిగా ఉందని, నాయకత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. బెంగళూరు వెళ్లి అసంతృప్త నేతలను కలిసి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు.

నాయకత్వ మార్పుపై పార్టీ నేతలు ఎవరూ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయవద్దని అరుణ్ సింగ్ సూచించారు. అయితే, అరుణ్ సింగ్ బెంగళూరు వెళ్లేది నాయకత్వ మార్పు పనిమీదేనని మరికొందరు నేతలు చెబుతున్నారు.