త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయి: బండి సంజయ్

10-06-2021 Thu 18:49
  • ప్రజాస్వామ్యవాదుల వేదిక బీజేపీయనన్న సంజయ్
  • కీలక నేతలు బీజేపీపై ఆసక్తి చూపుతున్నారని వెల్లడి
  • మంత్రిస్థాయి వ్యక్తికే రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యలు
  • ఈటల అంశాన్ని ప్రస్తావించిన వైనం
Bandi Sanjay comments on recent situations

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ వాదులకు, ప్రజాస్వామ్య వాదులకు ఏకైక వేదిక బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి ముఖ్యనేతలు కొందరు బీజేపీలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని వివరించారు.

రాష్ట్రంలో ఒక మంత్రిస్థాయి వ్యక్తికి, పాత్రికేయులకు, సామాన్య పౌరులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్ తన నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. క్యాబినెట్ లో కీలక మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్ కు పార్టీలో భద్రత లేని పరిస్థితులను కేసీఆర్ సృష్టించారని బండి సంజయ్ ఆరోపించారు. భజనపరులను ప్రోత్సహిస్తూ, తమకు నచ్చనివారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఇవాళ జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.