బాల‌కృష్ణ‌కు చంద్రబాబు, చిరంజీవి, లోకేశ్, ఎన్టీఆర్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు

10-06-2021 Thu 12:02
  • నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలి: చ‌ంద్ర‌బాబు
  • బాలా మావయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు:  లోకేశ్
  • మిత్రుడు బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు:  చిరు
  • జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్:  ఎన్టీఆర్
birth day wishes to balaiah

సినీన‌టుడు, టీడీపీ ఎమ్మెల్యే  బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలిపారు. 'హిందూపూర్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, నటుడిగా అసంఖ్యాక సినీ అభిమానులను పొందిన వెండితెర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల ఆశీర్వాద బలం, కీర్తి సంపదల తోడుగా నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను' అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.

'మిత్రుడు బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని సినీన‌టుడు చిరంజీవి ట్వీట్ చేశారు. 

'బాలా మావయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. కథానాయకునిగా ఇటు సినీ అభిమానులకు, హిందూపూర్ శాసనసభ్యునిగా అటు ప్రజలకు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ నిష్కళంక, నిస్వార్థ ప్రేమను పంచుతున్న మీ ఔదార్యం మాకు ఆదర్శం. బాలా మావయ్యా! మీరిలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని... అభిమానులకు నిత్య సంబరాలు జరుపుకునేలా, మరెన్నో చిత్రాలలో, విభిన్న పాత్రలలో నటిస్తూ నిండు నూరేళ్లూ వర్ధిల్లేలా దీవించమని ఆ దేవుని కోరుకుంటున్నాను' అని నారా లోకేశ్ అన్నారు.

'జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్. మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని సినీన‌టుడు ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

'జానపద, చారిత్రక, పౌరాణిక, సాంఘిక పాత్రలలో అద్భుతంగా నటించి తనదైన ముద్రవేస్తూ, సాంఘిక సేవా కార్యక్రమాలలో నిత్యం పాల్గొంటూ, నందమూరి తారకరామారావు గారి వారసత్వానికి వెలుగు తెచ్చిన నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం నేడు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని సినీ ర‌చ‌యిత‌ పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేశారు.
   
'నవయవ్వనుడు నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు అన్నీ శుభాలే జరగాలని దేవుడ్ని కోరుకుంటున్నాను' అంటూ ద‌ర్శ‌కుడు క్రిష్ ట్వీట్ చేశారు. 'నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా మీకు అన్నీ శుభాలే జరగాలని కోరుకుంటున్నాను' అని ద‌ర్శ‌కుడు సురేందర్‌ రెడ్డి పేర్కొన్నాడు.
'హ్యాపీ బర్త్‌డే బాలయ్య బాబు గారు. త్వరలో మిమ్మల్ని సెట్స్‌లో కలవడం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. మీ సింహగర్జనను ప్రత్యేక్షంగా చూసేందుకు సిద్ధంగా ఉన్నాను' అని ద‌ర్శ‌కుడు గోపీచంద్‌ మలినేని ట్వీట్ చేశారు.