BJP: యడియూరప్పను మార్చాలంటూ డిమాండ్.. అభిప్రాయ సేకరణలో అధిష్ఠానం బిజీ!

  • యడియూరప్పకు వ్యతిరేకంగా పెరుగుతున్న నిరసన గళం
  • అభిప్రాయ సేకరణ నివేదిక అందిన అనంతరం మార్పులు
  • సమావేశాన్ని త్వరగా నిర్వహించాలని ఎమ్మెల్యేల పట్టు
Over 65 MLAs write in support of BS Yediyurappa as CM

చూస్తుంటే కర్ణాటకలో నాయకత్వ మార్పు తథ్యంలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి యడియూరప్పపై అసంతృప్తిగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలంటూ డిమాండ్ చేస్తుండడంతో అటువైపు దృష్టిసారించిన అధిష్ఠానం అభిప్రాయ సేకరణకు నడుంబిగించింది. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ముఖ్యమంత్రిపై అభిప్రాయ సేకరణలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. వారు ఇచ్చే నివేదిక అనంతరం ముఖ్యమంత్రి మార్పుపై అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

నిజానికి బీజేపీలో సంతకాల సేకరణ అనే సంప్రదాయం లేదు. అయితే, ముఖ్యమంత్రి యడ్డీకి వ్యతిరేకంగా కొందరు సంతకాల సేకరణ చేపట్టినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు, యడియూరప్ప మద్దతుదారులు 65 మంది తమ అభిప్రాయాన్ని అధిష్ఠానానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని కనుక నిర్వహిస్తే తమ అభిప్రాయాన్ని చెబుతామని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అది కూడా అధిష్ఠానం నుంచి వచ్చే నేత సమక్షంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ చీఫ్ విప్ సునీల్ కుమార్ కూడా సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలంటూ ట్వీట్ చేయడం యడ్డీపై వ్యతిరేకతకు అద్దం పడుతోందని చెబుతున్నారు.  కాగా, పార్టీ బాధ్యుడు అరుణ్‌సింగ్ త్వరలోనే బెంగళూరు వచ్చి తాజా పరిణామాలపై ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News