సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

09-06-2021 Wed 07:19
  • వెబ్ సీరీస్ పై దృష్టి పెట్టిన తమన్నా 
  • పూరి జగన్నాథ్ కు మరో ఆఫర్
  • 'ఆదిపురుష్'కి సంగీత దర్శకద్వయం   
Tamanna eyes on more web series

*  మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల నటించిన 'నవంబర్ స్టోరీస్' వెబ్ సీరీస్ కి మంచి ఆదరణ లభించడంతో ఈ చిన్నది ఇక ఓటీటీ కంటెంట్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. పారితోషికం పరంగా కూడా ఈ వెబ్ సీరీస్ ఆకర్షణీయంగా ఉండడంతో మరిన్ని సీరీస్ లో నటించడానికి ఆమె నిర్ణయించుకుందని అంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కొన్ని వెబ్ సీరీస్ చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.
*  విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లైగర్' చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పూరి పనితనం, సినిమా అవుట్ ఫుట్ బాగా నచ్చడంతో తన బ్యానర్లో మరో సినిమా చేయమని పూరి జగన్నాథ్ కు కరణ్ జొహార్ మరో ఆఫర్ ఇచ్చాడట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.  
*  ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' చిత్రానికి సంగీత దర్శకులుగా బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం సాచేత్ టాండన్-పరంపర ఠాకూర్ లను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో కృతి సనన్ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే!