తమిళనాడు ముదుమలై అటవీ ప్రాంతంలో 28 ఏనుగులకు కరోనా పరీక్షలు

08-06-2021 Tue 18:56
  • ఇటీవల చెన్నై జూలో 9 సింహాలకు కరోనా పాజిటివ్
  • ఒక సింహం మృతి
  • ముందుజాగ్రత్తగా ఏనుగులకు పరీక్షలు
  • నమూనాలను ఉత్తరప్రదేశ్ పంపిన అధికారులు
Tamilnadu forest officials collects samples from elephants in Madumalai Tiger Reserve

తమిళనాడులో వన్యప్రాణులకు కూడా కరోనా సోకుతోంది. ఇటీవల చెన్నై వాండలూర్ జూలో 9 సింహాలకు కరోనా సోకగా, ఓ సింహం కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా తమిళనాడులోని ముదుమలై అభయారణ్యంలో 28 ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిలో 26 పెద్ద ఏనుగులు కాగా, రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి.

 ముదుమలై ఫారెస్ట్ లోని తెప్పక్కుడి క్యాంపు ఏరియాలో సంచరించే ఈ ఏనుగుల నుంచి నమూనాలు సేకరించిన అధికారులు.... ఉత్తరప్రదేశ్ లోని ఇజ్జత్ నగర్ లో ఉన్న ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కు పంపారు.

దీనిపై ముదుమలై అభయారణ్యం వెటర్నరీ నిపుణుడు డాక్టర్ కె.రాజేశ్ కుమార్ మాట్లాడుతూ, నమూనాల సేకరణలో తమకు ఏనుగులు చాలావరకు సహకరించాయని తెలిపారు. మత్తు ఇవ్వకుండానే వాటి నుంచి నమూనాలు సేకరించామని అన్నారు. మత్తు ఇస్తే అది తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఇది కేవలం పరిశీలన కోసమేనని, ఏనుగుల్లో ఏ ఒక్కదానికీ అనుమానిత లక్షణాలు లేవని తెలిపారు.