భారీ ర్యాలీ నిర్వ‌హిస్తోన్న ఈటల రాజేంద‌ర్.. ప‌లు గ్రామాల్లో హార‌తులు ప‌డుతోన్న మ‌హిళ‌లు

08-06-2021 Tue 11:58
  • శంభునిప‌ల్లి నుంచి క‌మ‌లాపూర్ వ‌ర‌కు ఈటల ద్విచ‌క్ర వాహ‌నాల‌ ర్యాలీ
  • కాసేప‌ట్లో క‌మ‌లాపూర్ శంభుని కానిప‌ర్తిలో ఈట‌ల రోడ్ షో
  • ఈట‌ల రాజేంద‌ర్ వ‌ద్ద‌కు భారీగా అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌లు 
etela begins road show

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌డానికి ఈట‌ల ఏర్పాట్లు పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేస్తోన్న రీతిలో ఆయ‌న ఈ రోజు భారీ బైక్ ర్యాలీ, రోడ్‌షోలు నిర్వ‌హిస్తున్నారు.

రాజీనామా ప్ర‌క‌ట‌న త‌ర్వాత త‌న హుజూ‌రాబాద్ నియోజ‌క వ‌ర్గంలో ఆయ‌న తొలిసారి ప‌ర్య‌టిస్తున్నారు. శంభునిప‌ల్లి నుంచి క‌మ‌లాపూర్ వ‌ర‌కు ఈటల రాజేంద‌ర్ ద్విచ‌క్ర వాహ‌నాల‌తో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన వ‌ద్ద‌కు అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌లు భారీగా చేరుకుంటున్నారు.

ప‌లు గ్రామాల్లో ఈట‌ల‌కు మ‌హిళ‌లు హార‌తులు ప‌డుతున్నారు. కాసేప‌ట్లో క‌మ‌లాపూర్ శంభుని కానిప‌ర్తిలో ఆయన రోడ్ షో నిర్వ‌హిస్తారు. ఈట‌ల ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. కాగా టీఆర్ఎస్ పార్టీతో 19 ఏళ్ల‌ అనుబంధానికి, ఆ పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన ఈట‌ల రాజేంద‌ర్ ఎమ్మెల్యే పదవికి కూడా త్వ‌ర‌లోనే రాజీనామా చేయనున్నట్లు తెలిసింది.

ఈట‌ల రాజేంద‌ర్ ఈ నెల 13న‌ బీజేపీలో చేర‌నున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు నేత‌లు కూడా బీజేపీలో చేర‌నున్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల నుంచి కూడా ఆయ‌నకు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.