Crime News: మ్యాట్రిమోని సైట్లలో తప్పుడు ఖాతాలు.. 12 మంది యువతులపై అత్యాచారం చేసిన యువకుడు!

Man held for sexually assaulting 12 women used matrimonial sites to lure them
  • నిందితుడిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
  • నాలుగు నెలలుగా వెతుకుతున్నామని వెల్లడి
  • నిందితుడు గతంలో హ్యాకర్ గా పనిచేశాడన్న పోలీసులు
వివాహ పరిచయ వేదికల్లో తప్పుడు వివరాలు పెట్టి.. యువతులను వలలో వేసుకుని, వారిపై అఘాయిత్యాలకు పాల్పడిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. నగరంలోని మలాడ్ కు చెందిన 33 ఏళ్ల మెకానికల్ ఇంజనీర్ అయిన మహేశ్ అలియాస్ కరణ్ గుప్తా ఈ మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

బాగా విద్యావంతులైన మహిళలే లక్ష్యంగా వివాహ పరిచయ వేదికల్లో తప్పుడు ఖాతాలు సృష్టించాడని, ప్రొఫైల్ నచ్చిన మహిళకు ఫోన్ చేసి పబ్బులు లేదా రెస్టారెంట్లు, మాల్స్ వద్ద కలిసేవాడని చెప్పారు. తన వద్దకు వచ్చిన మహిళలకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడన్నారు. అలా ఇప్పటిదాకా 12 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. అయితే, ఇంకా ఎక్కువ మందే అతడికి బాధితులై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ప్రతి నేరానికీ కొత్త ఫోన్ నంబర్ వాడాడని, అవి కూడా తన పేరు మీద తీసుకున్నవి కాదని చెప్పారు. కొంత కాలం క్రితం హ్యాకర్ గా పనిచేశాడని, దీంతో అతడికి కంప్యూటర్లపై మంచి పట్టుందని తెలిపారు. మంచి పేరున్న విద్యా సంస్థల్లోనే చదివాడని, పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు చేశాడని పేర్కొన్నారు. ఫిర్యాదులు అందడంతో నాలుగు నెలలుగా మహేశ్ కోసం వెతుకుతున్నామని, ఇప్పటికి దొరికాడని చెప్పారు.
Crime News
Rape
Matrimonial Sites
Maharashtra
Mumbai

More Telugu News