చోక్సీ భార‌త పౌరుడు.. అతని వ్యవహారాన్ని కోర్టులే నిర్ణయిస్తాయి: డొమినికా ప్ర‌ధాని

08-06-2021 Tue 11:19
  • డొమినికాలో విచార‌ణ ఎదుర్కొంటోన్న చోక్సీ
  • ఆయ‌న‌ వ్య‌వ‌హారం కోర్టు ప‌రిధిలో ఉందన్న డొమినికా ప్ర‌ధాని
  • ఆయ‌న హ‌క్కుల‌ను గౌర‌వించాల్సి ఉందని వ్యాఖ్య
Dominica PM terms Mehul Choksi Indian citizen says courts will decide on fugitive

పంజాబ్ నేష‌నల్ బ్యాంక్‌ను మోసం చేసి విదేశాల‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ డొమినికాలోని కోర్టులో విచార‌ణ ఎదుర్కొంటోన్న విష‌యం తెలిసిందే. అక్ర‌మంగా డొమినికాలోకి ప్ర‌వేశించ‌డంపై అక్కడి కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. అలాగే, త‌న‌ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని చోక్సీ వేసిన పిటిష‌న్‌పై కూడా విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను భార‌త్ తీసుకురావ‌డం కుదరడంలేదు. తాజాగా డొమినికా ప్ర‌ధాన‌మంత్రి రూజ్‌వెల్ట్ స్కెర్రిట్.. చోక్సీని భార‌త పౌరుడు అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

'ఈ భార‌త పౌరుడి (చోక్సీ) వ్య‌వ‌హారం కోర్టుల ప‌రిధిలో ఉంది.. అతని వ్యవహారాన్ని కోర్టులే నిర్ణయిస్తాయి. కోర్టులలో విచార‌ణ జ‌రగ‌నిద్దాం. ఆయ‌న హ‌క్కుల‌ను గౌర‌వించాల్సి ఉంది. ఆంటిగ్వా, భార‌త్‌లో ఆయ‌న వ్య‌వ‌హారాల గురించి మేము ఇప్పటివ‌ర‌కు ప‌ట్టించుకోలేదు. మేము మా బాధ్య‌త‌ల‌ను, విధులను నిర్వ‌హిస్తాం' అని రూజ్‌వెల్ట్ స్కెర్రిట్ వ్యాఖ్యానించారు.

కాగా, ఆంటిగ్వాలో అదృశ్య‌మైన చోక్సీ మే 23న డొమినికాలోని ఓ బీచ్‌లో డిన్న‌ర్ పార్టీ చేసుకుంటుండ‌గా పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. డొమినికాలోకి ఆయ‌న అక్ర‌మంగా ప్ర‌వేశించార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఆంటిగ్వా ప్ర‌భుత్వం త‌న‌ను భార‌త్‌కు అప్ప‌గించే అవ‌కాశం ఉండ‌డంతో ఆయ‌న క్యూబాకు పారిపోవాల‌న్న ఉద్దేశంతోనే ఆంటిగ్వా నుంచి డొమినికా చేరుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అయితే, త‌న గురించి త‌ప్పుడు క‌థ‌నాల‌ను రాస్తున్నారంటూ చోక్సీ నిన్న ఓ క‌రేబియ‌న్ మీడియా సంస్థ‌కు త‌న న్యాయ‌వాదుల ద్వారా నోటీసులు పంపారు. నిరాధార‌, ఊహాజ‌నిత క‌థ‌నాల‌ను ప్ర‌చురించార‌ని, ఆ మీడియా సంస్థ ఆ ఆర్టిక‌ల్స్‌ను డిజిట‌ల్ మాధ్య‌మాల నుంచి తొల‌గించాని చోక్సీ డిమాండ్ చేశారు. అలాగే, త‌న‌కు ఆ మీడియా సంస్థ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న నోటీసుల్లో పేర్కొన్నారు.