వారంతా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్టుకు అనుసంధానించాలి: కేంద్రం

07-06-2021 Mon 20:44
  • విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుసంధానం తప్పనిసరి
  • రెండు డోసుల మధ్య విరామం తగ్గింపునకు అనుమతి
  • 28 రోజుల తర్వాత కొవిషీల్డ్‌ రెండో డోసు తీసుకోవచ్చని స్పష్టం
all those who are travelling to abroad must link vaccine certificate to passport

విద్య, ఉద్యోగం, టోక్యో ఒలింపిక్స్‌ సహా ఇతర పనుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు తమ కొవిన్‌ ఆధారిత వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్ట్‌కు తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే వీరిలో ఇప్పటికే తొలి డోసు తీసుకున్నవారు 28 రోజుల తర్వాత కొవిషీల్డ్‌ రెండో డోసు తీసుకునేందుకు అనుమతించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశించింది. కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య విరామాన్ని 84 రోజుల వరకు పెంచిన విషయం తెలిసిందే. అయితే, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది.

అనుసంధాన ప్రక్రియలో వ్యాక్సిన్‌ రకం అనే ఆప్షన్‌ దగ్గర కొవిషీల్డ్‌ అని పెడితే సరిపోతుందని స్పష్టం చేసింది. ఇతర ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తోన్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి ఉందని స్పష్టం చేసింది.