Asaduddin Owaisi: ఎందుకీ అనవసర ఉపన్యాసం?: ప్రధాని మోదీ ప్రసంగంపై ఒవైసీ విమర్శలు

MIM Chief Asaduddin Owaisi comments on PM Modi speech delivered to the nation
  • జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
  • ధన్యవాదాలు అంటూ ఒవైసీ వ్యంగ్యం
  • ఇది ఓ ప్రెస్ రిలీజ్ వంటిదేనని వ్యాఖ్యలు
  • సుప్రీం వల్లే వ్యాక్సిన్ విధానం మార్చుకున్నారని వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీ నేడు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శనాస్త్రాలు సంధించారు. మరో అనవసర ప్రసంగం వినిపించినందుకు ప్రధానికి ధన్యవాదాలు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ మాత్రం దానికి ఓ ప్రెస్ నోట్ విడుదల చేస్తే సరిపోయేదని ఎద్దేవా చేశారు. కేంద్రం తన వ్యాక్సినేషన్ విధానాన్ని మార్చుకోవడానికి కారణం సుప్రీం కోర్టు ఆదేశాలే కారణం అయ్యుంటాయని తెలిపారు.

ఏదేమైనా దారుణమైన వ్యాక్సిన్ విధానం వైఫల్యాలకు రాష్ట్రాలను బాధ్యుల్ని చేస్తున్నారని ఆరోపించారు. కానీ, ప్రధాని మోదీనే వ్యాక్సిన్ సరఫరాపై ఘోరంగా విఫలం చెందారని ఒవైసీ విమర్శించారు. ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలకే మోదీ పెద్ద పీట వేశారని తెలిపారు. రాష్ట్రాలను అవమానించేందుకే ఇంత భయంకరమైన సరళీకృత వ్యాక్సిన్ విధానాన్ని తీసుకువచ్చారా? అనిపిస్తోందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడంలో ప్రయత్నాల కంటే మాటల గారడీకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.

"అన్నింటి గురించి వదిలేద్దాం... ఈ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పాలి. దేశంలో వ్యాక్సిన్లకు ఎందుకింత భారీ కొరత ఏర్పడింది? దేశంలో సంపన్న వర్గాలకు మాత్రం వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా, పేదవాళ్లు మాత్రం వేచిచూడాలి. ఫ్రంట్ లైన్ వర్కర్లకు సకాలంలో వ్యాక్సిన్లు ఇచ్చామని మోదీ జబ్బలు చరుచుకుంటున్నారు. ఆ కేటగిరీలోని 30 కోట్ల మందిలో మే నాటికి కేవలం 10 శాతం మందికే వ్యాక్సిన్లు ఇచ్చారు. అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలంటే జూలై నాటికి 60 కోట్ల డోసులు కావాలి. కానీ ఇప్పుడు మనం నెలకు 8 కోట్ల డోసులే పొందగలుగుతున్నాం. ప్రధాని ఈ కనీస లెక్కలను గుర్తించడంలోనూ విఫలమయ్యారు" అని విమర్శించారు.

చివరగా ఒవైసీ మరో వ్యాఖ్య కూడా చేశారు. 'వ్యాక్సిన్లపై చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారని మోదీ ఎత్తిచూపుతున్నారు. అయితే, ఆ విధంగా దుష్ప్రచారం చేసేవారిపైనా, సైన్స్ ను వ్యతిరేకించే వ్యక్తుల సేవలలో ఎల్లప్పుడూ తరించే మంత్రులపైనా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా' అంటూ స్పందించారు. ఈ క్రమంలో ఒవైసీ... బాబా రాందేవ్ తో మోదీ, కేంద్రమంత్రులు ఉన్నప్పటి ఫొటోలను కూడా పంచుకున్నారు.
Asaduddin Owaisi
Narendra Modi
Speech
Lecture
Corona Vaccine
India

More Telugu News