చెత్త రాజకీయాల కంటే కొన్ని సార్లు వారసత్వ రాజకీయాలే మేలు: అభిషేక్‌ బెనర్జీ

07-06-2021 Mon 20:15
  • తృణమూల్‌ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్‌
  • వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ విమర్శలు
  • తిప్పికొట్టిన మమత మేనల్లుడు అభిషేక్‌
  • అసెంబ్లీ ఎన్నికలో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్య
Sometimes dynasty politics are better than nasty politics says abhishek banerjee

తనని ఉద్దేశిస్తూ వారసత్వ రాజకీయాలంటూ విమర్శలు చేస్తున్న బీజేపీపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చెత్త రాజకీయాలు చేయడం కంటే కొన్ని కొన్ని సార్లు వారసత్వ రాజకీయాలే మేలంటూ చురకలంటించారు.

అభిషేక్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఇటీవలే తృణమూల్‌ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో తృణమూల్‌ను ఉద్దేశిస్తూ మమత వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ బీజేపీ వర్గాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. వాటికి కౌంటర్‌గానే తాజాగా అభిషేక్‌ స్పందించారు.

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ను  ఉద్దేశిస్తూ భాజపా వారసత్వ రాజకీయాలపై పెద్ద ప్రచారపర్వమే నిర్వహించిందని అభిషేక్ అన్నారు. అందుకు ప్రజలు వారికి సరైన సమాధానమిచ్చారన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని, చివరకు ఎన్నికల కమిషన్‌ను సైతం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుందని ఆరోపించారు. మరోవైపు బీజేపీ వైఖరి వల్లే దేశంలో కొవిడ్‌ విజృంభిస్తోందన్నారు. పరోక్షంగా సుదీర్ఘ కాలం పాటు ఎన్నికలు నిర్వహించడాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.