AP CID: రఘురామ మాకు చెప్పిన ఫోన్ నెంబరుకు, ఢిల్లీ పోలీసులకు చెప్పిన నెంబరుకు తేడా ఉంది: ఏపీ సీఐడీ వివరణ

AP CID responds to Raghurama Krishna Raju allegations
  • తన ఫోన్ ను సీఐడీ అధికారులు తీసుకున్నారన్న రఘురామ
  • ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు
  • స్పందించిన ఏపీ సీఐడీ అధికారులు
  • విచారణలో రఘురామ ఒక ఫోన్ నెంబరు చెప్పినట్టు వెల్లడి
  • ఢిల్లీ పోలీసులకు మరో నెంబరు చెప్పారని ఆరోపణ
తన ఐఫోన్ ను బలవంతంగా అన్ లాక్ చేయించారని, తన ఫోన్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అయితే, ఫోన్ విషయంలో రఘురామ చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు స్పందించారు.

రఘురామ వాడుతున్నది ఆపిల్ 11 ఐఫోన్ అని అధికారులు వెల్లడించారు. మే 15న ఆయన నుంచి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశామని వివరించారు. ఆ ఫోన్ లో ఉన్న నెంబరును ఇద్దరు సాక్షుల ముందు రఘురామ చెప్పగా, ఆ మేరకు స్టేట్ మెంట్ కూడా నమోదు చేశామని తెలిపారు. ఆ మేరకు సీఐడీ కోర్టుకు ఫోన్ స్వాధీనంపై సమాచారం అందించామని చెప్పారు.

కానీ, రఘురామ ఇప్పుడు దర్యాప్తు సంస్థలను తప్పుదారి పట్టించేలా ఆరోపణలు చేస్తున్నారని ఏపీ సీఐడీ అధికారులు పేర్కొన్నారు. రఘురామ తన ఫోన్ నెంబరు అంటూ ఢిల్లీ పోలీసులకు ఓ నెంబర్ ను చెప్పారని, ఆ నెంబరు మీడియాలో కూడా వచ్చిందని, అయితే, విచారణ సందర్భంగా తమకు చెప్పిన ఫోన్ నెంబరు మరొకటి అని వారు స్పష్టం చేశారు. మే 15న తాము నమోదు చేసిన రఘురామ స్టేట్ మెంట్ కు, ఢిల్లీ పోలీసులకు చేసిన ఫిర్యాదుకు తేడా ఉందని సీఐడీ అధికారులు వివరించారు.

కాగా, రఘురామ ఐఫోన్ ను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ విభాగానికి పంపిచామని, ఆయన ఫోన్ డేటాను గత నెల 31న కోర్టుకు కూడా సమర్పించామని సీఐడీ అధికారులు తెలిపారు.
AP CID
Raghu Rama Krishna Raju
IPhone
Delhi Police

More Telugu News