ఎల్.రమణ కారెక్కనున్నారా?... తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం!

07-06-2021 Mon 16:36
  • చకచకా మారుతున్న తెలంగాణ రాజకీయాలు
  • ఇటీవల ఈటలపై వేటు
  • ఎల్.రమణతో గులాబీ నేతల చర్చలు!
  • పార్టీ మార్పుపై రమణ సుముఖత!
  • పార్టీ మారితే ఎమ్మెల్సీ.. రమణకు ఆఫర్!
Reports says L Ramana may join TRS

టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారా?... ఇప్పుడీ అంశమే తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై  పలు కథనాలు దర్శనమిస్తున్నాయి. బీసీ వర్గ నాయకుడైన ఈటలపై వేటుతో ఏర్పడిన శూన్యాన్ని ఎల్.రమణతో భర్తీ చేయాలని గులాబీ నేతలు భావిస్తున్నట్టు ఆ కథనాల్లో పేర్కొంటున్నారు.

బీసీ సామాజికవర్గాల్లోనూ, కరీంనగర్ జిల్లాలోనూ రమణకు మంచి గుర్తింపు, పలుకుబడి వున్నాయి. రమణ గులాబీ తీర్థం పుచ్చుకుంటే బీసీల్లో పట్టు లభించడమే కాకుండా, కరీంనగర్ జిల్లాలో మరింతగా ప్రభావం చూపే వీలుంటుంది. ఇప్పటికే ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే సంజయ్ చర్చించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ లోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని వారు రమణకు వివరించినట్టు సమాచారం.

ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిలో ఒకటి రమణకు ఇచ్చే అవకాశాలున్నాయి. రమణ కారెక్కితే తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.