Ollie Robinson: కెరీర్ లో తొలి టెస్టు ఆడాడు... అంతలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ అయ్యాడు!

  • ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఓల్లీ రాబిన్సన్ పై వేటు
  • న్యూజిలాండ్ తో తొలి టెస్టు ద్వారా అరంగేట్రం
  • తెరపైకి వచ్చిన 2012-13 నాటి ట్వీట్లు
  • క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఈసీబీ
ECB suspends Ollie Robinson from all international cricket

ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో నిన్నటితో తొలి టెస్టు ముగిసింది. ఈ టెస్టు ద్వారా ఓల్లీ రాబిన్సన్ రూపంలో ఇంగ్లండ్ జట్టుకు ఓ ప్రతిభావంతుడైన ఆల్ రౌండర్ దొరికాడని క్రికెట్ పండితులు పేర్కొన్నారు. కానీ అంతలోనే ఆ కొత్త క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఎప్పుడో 2012-13లో రాబిన్సన్ చేసిన ట్వీట్లు ఇప్పుడు కొంపముంచాయి.

ప్రస్తుతం 27 ఏళ్ల ప్రాయంలో ఉన్న రాబిన్సన్ నాడు టీనేజర్ గా ఉన్న సమయంలో ముస్లింలపైనా, ఆసియా సంతతి మహిళలపైనా చేసిన వివక్ష పూరిత, అభ్యంతరకర వ్యాఖ్యలు ఇన్నాళ్లకు బయటకు రాగా.... ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తీవ్రంగా పరిగణించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఓల్లీ రాబిన్సన్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అతడి వ్యాఖ్యలపై దర్యాప్తును పెండింగ్ లో ఉంచింది.

విఖ్యాత లార్డ్స్ మైదానంలో నిన్న ముగిసిన తొలి టెస్టులో ఓల్లీ రాబిన్సన్ బౌలింగ్ లో 7 వికెట్లు సాధించడమే కాదు, బ్యాటింగ్ లోనూ రాణించి 42 పరుగులు చేశాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత అంతటి ఆల్ రౌండర్ అయ్యే లక్షణాలున్నాయన్న అభిప్రాయాలు వినిపించాయి. కానీ ఇంతలోనే అతడి కెరీర్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.

దీనిపై ఓల్లీ రాబిన్సన్ క్షమాపణలు తెలియజేశాడు. తన వ్యాఖ్యల పట్ల సిగ్గుపడుతున్నానని పేర్కొన్నాడు. అయితే తాను వర్ణ వివక్ష, అభ్యంతరకర భావజాలం ఉన్న వ్యక్తిని మాత్రం కానని స్పష్టం చేశాడు. ఇక, ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ రూట్ స్పందిస్తూ... జరిగిన దానికి ఓల్లీ రాబిన్సన్ ఎంతో పశ్చాత్తాపం చెందుతున్నాడని, అతడి క్షమాపణలో నిజాయతీ కనిపించిందని తెలిపాడు.

More Telugu News