లాక్‌డౌన్ స‌డ‌లింపుల ప్ర‌భావం.. ఒక్క‌సారిగా భారీగా రోడ్ల‌పైకి వ‌చ్చిన జ‌నాలు.. ఫొటోలు ఇవిగో

07-06-2021 Mon 12:48
  • ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌లో స‌డ‌లింపులు
  • ర‌ద్దీగా క‌న‌ప‌డుతోన్న బ‌స్టాండ్లు
  • ప‌లు చోట్ల భౌతిక దూరం పాటించ‌ని ప్ర‌జ‌లు
  • తిరిగి ముంబై, ఢిల్లీ చేరుకుంటోన్న వ‌ల‌స కార్మికులు
unlock in maharastra and delhi

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఢిల్లీ, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు నేటి నుంచి స‌డ‌లించాయి. మ‌హారాష్ట్ర‌లో ద‌శ‌ల వారీగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ఐదు దశల్లో ఆంక్షలను సడలిస్తున్నారు.

స‌డ‌లింపులు ఇచ్చిన న‌గ‌రాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున జ‌నాలు రోడ్ల‌పైకి వ‌చ్చేశారు. దీంతో ప‌లు ప్రాంతాలు ర‌ద్దీగా క‌న‌ప‌డుతున్నాయి. ప‌లు ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, ఇత‌ర దుకాణాలు తెరుచుకోవ‌డంతో జ‌నాలు అక్క‌డ కూడా భారీగా క‌న‌ప‌డుతున్నారు.

బ‌స్టాండ్ల‌లో క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌లు చేయ‌డంతో లైన్‌లో నిల‌బ‌డి బ‌స్సులు ఎక్కుతున్నారు. ఢిల్లీలోనూ నేటి నుంచి వ్యాపార, వాణిజ్య‌, రవాణా కార్యకలాపాలు, షాపింగ్ మాల్స్ తెరుచుకోవ‌డంతో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున రోడ్ల‌పై క‌న‌ప‌డుతున్నారు.

ప‌లు ప్రాంతాల్లో క‌రోనా నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఢిల్లీలో ప్ర‌యాణికులు పెద్ద ఎత్తున‌ మెట్రో రైళ్ల‌లో ప్ర‌యాణిస్తున్నారు. ముంబై, ఢిల్లీ నుంచి సొంత ప్రాంతాల‌కు వెళ్లిన వ‌ల‌స కార్మికులు మ‌ళ్లీ ఆయా న‌గ‌రాల‌కు తిరిగి వ‌స్తున్నారు.