USA: క‌రోనా మూలాల‌పై చైనా పార‌ద‌ర్శ‌క స‌మాచారాన్ని ఇవ్వ‌ట్లేదు.. అక్కడ ప‌రిశోధ‌న‌లు జ‌ర‌పాల్సిందే: అమెరికా

  • క‌రోనా మూలాలపై లోతుగా ప‌రిశోధ‌న జ‌ర‌పాలి
  • ఈ విష‌యంపై జో బైడెన్ ప్ర‌భుత్వం దృఢ‌నిశ్చ‌యంతో ఉంది
  • చైనాను జ‌వాబుదారీ చేయాలి
Blinken calls on China to cooperate in getting to bottom of COVID19 origins

క‌రోనా వైర‌స్ పుట్టుక ర‌హ‌స్యాన్ని ఛేదించేందుకు దాని మూలాలపై లోతుగా ప‌రిశోధ‌న జ‌ర‌పాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. క‌రోనా మూలాల‌ను క‌నుగొనాల‌ని ప్ర‌పంచంలోని చాలా దేశాల నుంచి మ‌రోసారి పెద్ద ఎత్తున డిమాండ్ వ‌స్తోన్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాజాగా బ్లింకెన్‌ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... క‌రోనా మూలాల‌ను క‌నుగొంటే మ‌రో మ‌హ‌మ్మారి రాకుండా నివారించగలుగుతామని, కనీసం దాని తీవ్రతనైనా త‌గ్గించ‌వ‌చ్చని అన్నారు. ఈ ముఖ్య కార‌ణాల వ‌ల్లే తాము క‌రోనా మూలాల‌ను క‌నుక్కోవాల‌ని చెబుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

క‌రోనా వైర‌స్‌ మూలాల‌ను క‌నుగొనే విష‌యంలో జో బైడెన్ ప్ర‌భుత్వం దృఢ‌నిశ్చ‌యంతో ఉంద‌ని ఆంటోనీ బ్లింకెన్ వివ‌రించారు. క‌రోనా పుట్టుక గురించి తాము అడుగుతోన్న విష‌యాల‌పై చైనా పార‌ద‌ర్శ‌క స‌మాచారాన్ని ఇవ్వ‌ట్లేద‌ని చెప్పారు. క‌రోనాకు సంబంధించిన స‌మాచారం మొత్తాన్ని చైనా ఇవ్వాల‌ని ఆయ‌న అన్నారు.

క‌రోనా పుట్టుక గురించి ప‌రిశోధ‌న‌లు జ‌రిపేందుకు వ‌చ్చేందుకు ప్ర‌పంచ నిపుణుల‌కు పూర్తి స్థాయిలో అనుమ‌తులు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. క‌రోనా వ్యాప్తిపై చైనాను జ‌వాబుదారీ చేయాల్సిన అవ‌స‌రం ఉందని ఆయ‌న చెప్పారు. కాగా, క‌రోనా వైర‌స్‌ను చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే సృష్టించార‌ని మ‌రోసారి ప్ర‌పంచ వ్యాప్తంగా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్రపంచం‌లోని ప‌లు దేశాల ప‌రిశోధ‌కులు చేసిన ప‌రిశోధ‌న‌లు కూడా ఇవే చెబుతుండ‌డంతో అమెరికా ఈ అంశాన్ని మ‌రోసారి సీరియ‌స్‌గా తీసుకుంటోంది. ఇటీవ‌లే అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ కూడా మాట్లాడుతూ... క‌రోనా వూహాన్ ల్యాబ్‌ నుంచే అది లీక్ అయింద‌ని, ల్యాబ్‌లో శాస్త్ర‌వేత్త‌లే సృష్టించారని ఇటీవల పలు అధ్యయనాలు చెప్పిన విష‌యాల‌ను గుర్తు చేసిన విష‌యం తెలిసిందే. క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మైన‌ చైనా భారీగా జ‌రిమానా చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్ప‌ట్లో క‌రోనా పుట్టుక గురించి తాను చెప్పింది ఇప్పుడు  ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News