ఉదయం పెళ్లాడి, రాత్రి ప్రియుడితో పారిపోవాలని ప్లాన్.. పెళ్లి పీటల నుంచే ప్రియుడితో చాటింగ్!

07-06-2021 Mon 09:33
  • మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన
  • మండపంలో అనుమానాస్పదంగా కనిపించిన యువకుడికి దేహశుద్ధి
  • ఆగిపోయిన  పీటలపై పెళ్లి
Bride Chatting with Boy Friend from the Marriage hall marriage stops

ఉదయం పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని రాత్రికి ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలన్న యువతి ప్లాన్ బెడిసికొట్టింది. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరినా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన యువతికి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది.

పెళ్లి కోసం వధువు కుటుంబ సభ్యులు శనివారమే వరుడి గ్రామానికి చేరుకున్నారు. నిన్న పెళ్లి పీటలపై కూర్చున్న వధువు అదే పనిగా సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేస్తుండడం, ఎవరితోనో మాట్లాడుతుండడంతో అనుమానించిన బంధువులు నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. తాను మూడేళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని, పెళ్లి జరిగిన తర్వాత రాత్రికి అతడితో కలిసి వెళ్లిపోవాలని అనుకున్నామని అంగీకరించింది.

అదే సమయంలో అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన వరుడి తరపు బంధువులు అతడు చెప్పింది విని విస్తుపోయారు. ఆమె, తను గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని సదరు యువకుడు చెప్పాడు. తర్వాత అతడి సెల్‌ఫోన్‌లో ఇద్దరూ కలసి దిగిన ఫొటోలను చూసి అంతా షాకయ్యారు. వెంటనే వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారించిన పోలీసులు ఎవరూ కేసు పెట్టకపోవడంతో ఇద్దరినీ వదిలేశారు. ఇరు వర్గాల అంగీకారంతో వధూవరులు ఎవరింటికి వారు వెళ్లిపోయారు.