ముహూర్తం ఫిక్స్.. 13న బీజేపీలోకి ఈటల

07-06-2021 Mon 06:32
  • మూడు రోజుల క్రితం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా
  • ఈటలతోపాటు పార్టీ తీర్థం పుచ్చుకోనున్న మరికొందరు
  • ఢిల్లీలో నడ్డా సమక్షంలో కాషాయ కండువా
Etela Rajender to join in BJP on 13th june

టీఆర్‌ఎస్ పార్టీకి,  శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 13న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మాజీ నేత తుల ఉమ తదితరులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల బీజేపీలో చేరుతారన్న ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిసి చర్చించారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఆయన గత శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్నారు.  8, లేదంటే 9వ తేదీల్లో బీజేపీలో చేరుతానని ప్రకటించారు. అయితే, తాజాగా 13న బీజేపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.