కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్లే వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో గందరగోళం: కేటీఆర్‌

06-06-2021 Sun 21:08
  • ట్విటర్‌లో నేడు ఆస్క్‌ కేటీఆర్‌
  • లెట్స్‌ టాక్‌ వ్యాక్సినేషన్‌తో చర్చ ప్రారంభం
  • భారత్‌ ఆలస్యంగా టీకాలకు ఆర్డర్‌ పెట్టిందని ఆరోపణ
  • రాష్ట్రాలే టీకాలు కొనుక్కోవాలనడం తప్పుడు నిర్ణయం
KTR Fires on central vaccination policy

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పట్ల రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీకా తయారీ ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా ఉన్న భారత్‌లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడడమేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్నారు. ట్విటర్‌లో తరచూ నిర్వహించే ‘ఆస్క్‌ కేటీఆర్‌’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈరోజు ‘లెట్స్‌ టాక్ వ్యాక్సినేషన్‌’ అనే అంశంతో చర్చను ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాలుస్తుండడం చూసి ప్రపంచదేశాలు గత ఏడాది మే నెలలోనే వ్యాక్సిన్ల కోసం ఆర్డర్లు పెట్టాయని తెలిపారు. కానీ, భారత్‌ మాత్రం జనవరి వరకు తాత్సారం చేసిందని ఆరోపించారు. మరోవైపు కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు, తయారీ కంపెనీల నుంచి నేరుగా రాష్ట్రాలే టీకాలు కొనుగోలు చేయాలని కోరడం వంటి నిర్ణయాలు వ్యాక్సినేషన్ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. మరోవైపు తయారీ కంపెనీలు రాష్ట్రాలకు నేరుగా టీకాలు ఇచ్చేందుకు నిరాకరించాయన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గందరగోళంగా మారిందని ఆరోపించారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.