ఇక పెట్రోల్​ లో 20% ఇథనాల్​.. రోడ్​ మ్యాప్​ విడుదల చేసిన ప్రధాని మోదీ

05-06-2021 Sat 13:29
  • 2025 నాటికి లక్ష్యాన్ని అందుకుంటామని వెల్లడి
  • పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 250% పెరిగిందని కామెంట్
  • ఆరేళ్లలో సౌర విద్యుత్ 15 రెట్లు పెరుగుదల
India to target 20 percent ethanol blend in petrol modi releases road map

దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పెట్రోల్ ఇథనాల్ వాడకంపై నిపుణులు ప్రతిపాదించిన రోడ్ మ్యాప్ (కార్యాచరణ)ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. పెట్రోలియం, అటవీ పర్యావరణ శాఖలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పర్యావరణ పరిరక్షణపై వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులతో ఇథనాల్ కలిపిన పెట్రోల్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రోగ్రామ్ కు సంబంధించి మాట్లాడారు.

2025 నాటికి 20% ఇథనాల్ ఉన్న పెట్రోల్ ను అందించేందుకు లక్ష్యాలు నిర్దేశించుకున్నామని మోదీ చెప్పారు. ఈ ఏడేళ్లలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకున్నామన్నారు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 250 శాతం పెరిగిందని చెప్పారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం ప్లాంట్లు ఏర్పాటు చేసిన దేశాల జాబితాలో భారత్ టాప్ 5లో చోటు సంపాదించిందన్నారు.

ఆరేళ్లలో సౌర విద్యుత్ సామర్థ్యం 15 రెట్లు పెరిగిందని ఆయన చెప్పారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూనే ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేలా పనిచేస్తున్నామన్నారు. పర్యావరణాన్ని కాపాడడం కోసం అభివృద్ధి పనులను ఆపాల్సిన అవసరం లేదని చెప్పేందుకు ప్రపంచం ముందు ఎన్నో ఉదాహరణలు భారత్ పెట్టిందన్నారు.

దేశానికి ఇథనాల్ ఉత్పత్తి, సరఫరా కోసం పూణెలోని మూడు ప్రాంతాల్లో ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఈ–100 పైలట్ ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. కాగా, కొత్త నివేదిక ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి 20% ఇథనాల్ ఉన్న పెట్రోల్ ను అమ్మేందుకు అనుమతులు ఇవ్వనున్నారు.