Etela Rajender: ఈటల రాజేందర్ పాత వీడియోలు, ఆడియో క్లిప్పింగ్ లను వైరల్ చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు

TRS is making viral of Etela Rajenders videos of praising KCR
  • గతంలో కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన ఈటల
  • ముదిరాజ్ ల తల్లి పాలు తాగి పెరిగారంటూ కితాబు
  • ఏపీ ప్రజలు కూడా కేసీఆర్ లాంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్య
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ అనేది బానిసల నిలయమని విమర్శించారు. మంత్రులకు కూడా ఏ మాత్రం గౌరవం లేదని అన్నారు. టీఆర్ఎస్ అనేది కుటుంబ పార్టీ కాదని... ఎందరో త్యాగాల ఫలితంగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆయన ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే టీఆర్ఎస్ నేతలు వరుసగా మీడియా ముందుకు వచ్చి ఈటలపై విమర్శలు గుప్పించారు.

తాజాగా గతంలో కేసీఆర్ ను పొగుడుతూ, బీజేపీని విమర్శిస్తూ ఈటల రాజేందర్ మాట్లాడిన వీడియోలను, ఆడియో క్లిప్పింగులను టీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. ముదిరాజ్ ల తల్లి పాలను తాగి కేసీఆర్ పెరిగారని... ఆ ప్రేమతోనే ముదిరాజ్ ల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఓ వీడియోలో రాజేందర్ అన్నారు. తమకు కూడా ఒక కేసీఆర్ ఉంటే బాగుండని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. బీజేపీ భూస్థాపితం అవుతుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలన్నీ ఆ వీడియోల్లో ఉన్నాయి.

అంతేకాదు, కేసీఆర్ బంధువు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ ను ఈటల పొగిడిన వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో సంతోష్ బయటకు తెలియనప్పటికీ, కేసీఆర్ కు వెన్నంటి ఉండి, అన్ని రకాలుగా సహకారం అందించారని ఈటల కొనియాడారు. గొప్ప షాక్ అబ్జార్బర్ గా సంతోష్ పని చేస్తున్నారని తాము అనుకుంటున్నామని చెప్పారు.
Etela Rajender
TRS
KCR
Videos

More Telugu News