నా ఐఫోన్ ఇచ్చేయండి... సీఐడీ అదనపు డీజీకి రఘురామ లీగల్ నోటీసు

05-06-2021 Sat 09:04
  • అరెస్ట్ సమయంలో ఫోన్ తీసేసుకున్నారన్న రఘురామ
  • దాంట్లో విలువైన సమాచారం ఉందని వెల్లడి
  • కుటుంబీకుల వ్యక్తిగత వివరాలున్నాయని వివరణ
  • ఫోన్ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరిక
MP Raghurama Krishna Raju issued legal notice to CID Additional DGP Sunil Kumar

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ ను ఉద్దేశిస్తూ లీగల్ నోటీసు జారీ చేశారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ పోలీసులు తన ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నారని, దాన్ని తిరిగిచ్చేయాలని కోరారు. స్వాధీనం చేసుకున్న ఐఫోన్ ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదని రఘురామ ఆరోపించారు. ఆ ఫోన్ లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పార్లమెంటులో తాను స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నానని, ఫోన్ లో దానికి సంబంధించిన విలువైన సమాచారం కూడా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంటు విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఫోన్ తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. తన ఫోన్ ను అప్పగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. మంగళగిరి సీఐడీ హెచ్ఎస్ఓకు ఈ మేరకు లీగల్ నోటీసులు పంపారు.