ఒలింపిక్స్‌ ఛాంపియన్‌పై ఐదేళ్ల నిషేధం!

04-06-2021 Fri 21:05
  • డోపింగ్‌ టెస్టు నియమాలను ఉల్లంఘించిన అమెరికా అథ్లెట్‌ బ్రియానా మెక్‌నీల్‌
  • నిషేధానికి గురవడం ఇది రెండోసారి
  • నిషేధాన్ని సవాల్‌ చేస్తూ సీఏఎస్‌లో అప్పీల్‌
  • ఒలింపిక్స్‌ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతి
  • అమెరికా తరఫున రియో ఒలింపిక్స్‌లో బంగారు పతకం
Hurdles Olympic Champion Brianna McNeal Banned for 5 yrs

అమెరికాకు చెందిన 100 మీటర్ల హర్డిల్స్‌ ఒలింపిక్‌ ఛాంపియన్‌ బ్రియానా మెక్‌నీల్ మరోసారి డోపింగ్‌ టెస్టు నియమాలను ఉల్లంఘించింది. దీంతో ఆమెపై ‘అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్‌(ఏఐయూ)’ ఐదేళ్ల నిషేధం విధించింది. దీంతో రాబోయే ఒలింపిక్‌ క్రీడల్లో ఆమె పాల్గొనడంపై నీలి నీడలు కమ్ముకొన్నాయి. అయితే, ఏఐయూ నిర్ణయాన్ని ఆమె కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌(సీఏఎస్‌)లో అప్పీల్‌ చేసింది. దీన్ని సీఏఎస్‌ జులై 23న విచారించనుంది.

అయితే, ఒలింపిక్‌ ట్రయల్స్‌ కోసం జూన్‌ 27న అమెరికా నిర్వహించే పోటీల్లో మాత్రం పాల్గొనేందుకు సీఏఎస్‌ అనుమతించింది. అప్పటి వరకు ఏఐయూ విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2016, రియో ఒలింపిక్స్‌లో మెక్‌నీల్‌ బంగారు పతకం సాధించింది. అంతకుముందు 2013లో వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. 2017లో మూడు యాంటీ డోపింగ్‌ టెస్టులు తప్పించుకున్నందుకుగానూ ఆమెపై ఏఐయూ ఏడాదిపాటు నిషేధం విధించింది. దీంతో 2017లో జరిగిన వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆమె పాల్గొనలేకపోయింది.