ఆలస్యమైనా పరీక్షలు జరపడమే మంచి పద్ధతి: కమలహాసన్

04-06-2021 Fri 20:27
  • కరోనా వేళ అనిశ్చితిలో పరీక్షల అంశం
  • తమిళనాట ఇంటర్ పరీక్షలపై కమల్ స్పందన
  • కేంద్రం పలు పరీక్షలు వాయిదావేసి విమర్శలపాలైందని వెల్లడి
  • కేరళలో ఇప్పటికే పరీక్షలు జరిపారన్న కమల్
  • కేరళ బాటలో నడవాలని స్టాలిన్ సర్కారుకు సూచన
Kamal Haasan wants to conduct exams for Inter students

కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో పలు పరీక్షలు రద్దు చేయడం తెలిసిందే. అయితే పలు రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేసి, ఆ పరీక్షలు నిర్వహించేందుకు తగిన సమయం కోసం చూస్తున్నాయి. దీనిపై విమర్శలు వస్తున్నాయి. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంటర్ పరీక్షలపై అనిశ్చితి ఏర్పడింది. దీనిపై మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమలహాసన్ స్పందించారు.

స్టాలిన్ ప్రభుత్వం విద్యార్థుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఫారెన్ వర్సిటీలు, ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల్లో ఇంటర్ మార్కులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. ఆలస్యమైనా సరే, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడమే సరైన విధానం అని స్పష్టం చేశారు. ఇప్పటికే కేంద్రం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలను రద్దు చేయగా, అనేక విమర్శలు వస్తున్నాయని కమల్ పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయాన్ని విద్యారంగ నిపుణులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

అయితే, కేరళ ఇప్పటికే పరీక్షలు నిర్వహించిందని, కేరళలో బాటలో తమిళనాడు పయనించాలని కమల్ అభిలషించారు. అందుకు, సరైన ప్రణాళిక రూపొందించుకుని, అందుకు అనుగుణంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఒకవేళ అవసరమైతే సిలబస్ తగ్గించైనా పరీక్షలు జరపాలని సూచించారు.