కరోనా వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముతున్నారంటూ పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

04-06-2021 Fri 16:52
  • పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన సుఖ్ బీర్ సింగ్ బాదల్
  • డోసు వ్యాక్సిన్ ను రూ. 400 కు కొని రూ. 1,060కి అమ్మారని ఆరోపణ
  • ఆరోపణలపై విచారణకు ఆదేశించామన్న పంజాబ్ ఆరోగ్య మంత్రి
Allegations on Punjab govt that it is selling Corona vaccines to private hospitals for high price

కరోనా వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారంటూ పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ ఆరోగ్య మంత్రి బీఎస్ సిద్దూ ఈరోజు స్పందిస్తూ... ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించామని చెప్పారు. వ్యాక్సిన్లపై తనకు ఎలాంటి కంట్రోల్ లేదని... కేవలం ట్రీట్మెంట్, టెస్టింగ్, కరోనా వ్యాక్సిన్ క్యాంపులను మాత్రమే తాను చూసుకుంటున్నానని తెలిపారు. తాను కూడా వ్యక్తిగతంగా ఈ ఆరోపణలపై విచారణ జరుపుతానని చెప్పారు.

పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం 40వేల డోసుల వ్యాక్సిన్లను పెద్ద మార్జిన్ కు ప్రైవేట్ హాస్పిటల్స్ కు అమ్ముకుందంటూ అకాళీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. ఒక డోస్ వ్యాక్సిన్ ను రూ. 400కు కొని, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 1,060కి అమ్ముకుంటున్నారని.. ఒక్కో డోసుపై రూ. 660లను అక్రమంగా సంపాదిస్తున్నారని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఒక్కో డోసును రూ. 1,560కి వేస్తున్నారని తెలిపారు.

ఈ ధరల వల్ల వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఒక్కో కుటుంబానికి రూ. 6 వేల నుంచి 9 వేల వరకు ఖర్చవుతోందని చెప్పారు. ఒక్క మొహాలీలోనే ఒకే రోజున రూ. 2 కోట్ల ప్రాఫిట్ కు వ్యాక్సిన్లను అమ్ముకున్నారని అన్నారు. ఈ ఆరోపణలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి.