KTR: గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో కరోనా రోగులను పరామర్శించిన మంత్రి కేటీఆర్

  • టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేటీఆర్
  • కరోనా రోగులతో మాటామంతీ
  • ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న వైనం
  • కరోనా వ్యాక్సినేషన్ అంశంలో కేంద్రంపై విమర్శలు
Minister KTR visits TIMS and talked to corona patients

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న రోగులను ఆయన పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి బెడ్ వద్దకు వెళ్లి కరోనా రోగులను పలకరించారు.

ఆసుపత్రి సందర్శన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఏడాది కాలంగా టిమ్స్ మెరుగైన సేవలు అందించిందని వెల్లడించారు.టిమ్స్ వైద్య సిబ్బంది కూడా ఎంతో శ్రమిస్తున్నారని కొనియాడారు. ఐటీ కంపెనీలు రూ.80 కోట్ల వ్యయంతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టాయని, సీఎస్ఆర్ కింద ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్నాయని వివరించారు. పలు సాఫ్ట్ వేర్ సంస్థలు రూ.15 కోట్లతో 150 ఐసీయూ బెడ్లను విరాళంగా అందించాయని, వాటిని టిమ్స్ లో అమర్చినట్టు తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందని, లాక్ డౌన్ పూర్తయ్యేసరికి కరోనా వ్యాప్తి బాగా అదుపులోకి వస్తుందని వైద్యులు కూడా చెబుతున్నారని వివరించారు. ఇక, కరోనా వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతూ, కేంద్రం నిర్ణయాల వల్లే టీకాల ప్రక్రియ నిదానంగా సాగుతోందని విమర్శించారు. వ్యాక్సిన్ల అంశంలో కేంద్రం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తోందని కేటీఆర్ ఉద్ఘాటించారు.

More Telugu News