Chiranjeevi: ఎస్పీ బాలు స్మృతిలో చిరంజీవి ఆవేదనా భరిత వీడియో

Chiranjeevi in memory of legendary SP Balasubrahmanyam
  • నేడు ఎస్పీ బాలు జయంతి
  • ఆత్మీయ అనుబంధాన్ని వెల్లడించిన చిరంజీవి
  • అందరికీ దూరమైపోయారని తీవ్ర విచారం
  • అభిమానులకు అన్యాయం చేసి వెళ్లిపోయారని వెల్లడి
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా ఈ లోకంలో లేకపోయినా పాట రూపంలో ఎప్పటికీ నిలిచిపోతారన్నది అందరి మాట. నేడు ఎస్పీ బాలు 75వ జయంతి. కరోనా మహమ్మారి బలితీసుకోకుండా ఉండుంటే ఆయన ఇవాళ అందరి మధ్య పుట్టినరోజు జరుపుకునేవారేమో! కానీ భారత సంగీత రంగం దురదృష్టం కొద్దీ ఆయన మన మధ్య లేకుండా పోయారు! ఈ నేపథ్యంలో, సినీ ప్రముఖులు బాలు జయంతి సందర్భంగా ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని చెమర్చిన కళ్లతో అశ్రునివాళులు అర్పిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా బాలుతో తన ఆత్మీయతను ఓ వీడియోలో వివరించారు. ఆయనను తాను ఎస్పీ బాలు గారూ అంటుండడంతో ఎంతో బాధపడ్డారని, ఎప్పుడూ నోరారా అన్నయ్య, నువ్వు అనేవాడివి ఇవాళ బాలు గారూ అంటున్నావేంటి అని చిరుకోపం ప్రదర్శించారని చిరంజీవి వివరించారు.

"బాలు గారూ అంటూ మర్యాదగా పిలిచి నన్ను దూరం చేస్తున్నావా అన్నారు. మీ ఔన్నత్యం తెలిశాక మీలాంటి వారిని ఏకవచనంతో సంబోధించడం సరికాదనుకుంటున్నానని చెప్పడంతో, అలా పిలిచి నన్ను దూరం చెయ్యకయ్యా అన్నారు. కానీ, ఇవాళ మనందరికీ అన్యాయం చేసి ఆయన దూరమయ్యారు" అంటూ చిరంజీవి భావోద్వేగాలకు లోనయ్యారు.

అంతేకాదు, ఈ వీడియోలో ఎస్పీ బాలు సోదరి ఎస్పీ వసంత ఆలపించిన గీతాలను కూడా పొందుపరిచారు. అనితర సాధ్యుడు, మహాగాయకుడు, ప్రియసోదరుడైన బాలు గారికి ఓ చెల్లి అశ్రునీరాజనం అంటూ చిరంజీవి ఈ విడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు.
Chiranjeevi
SP Balasubrahmanyam
Memory
Birth Anniversary
Tollywood

More Telugu News