పేదల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు: జోగి రమేశ్

03-06-2021 Thu 17:50
  • వైఎస్సార్ జగనన్న కాలనీల గృహనిర్మాణాలు ప్రారంభం
  • సీఎం జగన్ పై జోగి రమేశ్ ప్రశంసలు
  • జగన్ పాలనకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి
  • జగన్ బీసీల ఆత్మబంధువు అని వ్యాఖ్యలు
Jogi Ramesh hails CM Jagan

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్ ఇవాళ వైఎస్సార్ జగనన్న కాలనీల గృహనిర్మాణానికి ప్రారంభోత్సవం చేయగా, దీనిపై జోగి రమేశ్ స్పందించారు. పేదల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారని కొనియాడారు. కోటి 21 లక్షల మందికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టిస్తున్నామని వెల్లడించారు.

ఈ సందర్భంగా జోగి రమేశ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలుగు డ్రామా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంటూ అభివర్ణించారు. ఎల్లో మీడియాతో కలిసి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. ఇవాళ చంద్రబాబు వెంట ఏ కులం, ఏ వర్గం కూడా లేదని అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారని, సీఎం జగన్ పాలనకు ఏపీ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని జోగి రమేశ్ చెప్పుకొచ్చారు. బీసీల ఆత్మబంధువు సీఎం జగన్ అని కీర్తించారు.